వణికిస్తున్న రైలు ప్రయాణం

9 Dec, 2017 06:53 IST|Sakshi
విరిగిన రైలు కమ్మీ(ఫైల్‌) విరిగిన రైలు కమ్మీలను మరమ్మతు చేస్తున్న సిబ్బంది (ఫైల్‌)

చలికాలం చంపేస్తుంది

ఎక్కడికక్కడ విరుగుతున్న రైలు కమ్మీలు

38 రోజుల్లో 11ప్రాంతాల్లో విరిగిన పట్టాలు

వేధిస్తున్న సిబ్బంది కొరత

ఆందోళనలో ప్రయాణికులు, రైల్వే అధికారులు

గుంతకల్లు: శీతాకాలం అంటే రైల్వే ప్రయాణికులే కాదు.. ఆ శాఖ అధికారులను సైతం హడలెత్తిపోతున్నారు. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, తగినంత ఉష్ణోగ్రత లేకపోవడం వంటి కారణాతో రైలు కమ్మీలు విరిగిపోవడం, వెల్డింగు జాయింట్లు ఊడిపోవడం వంటి ఘటనలతో రైలు ప్రయాణమంటేనే ప్రయాణికులే కాకుండా ఆ శాఖ అధికారులు కూడా వణికిపోతున్నారు. ముఖ్యంగా నల్లరేగడి, చెరువుల సమీపంలోని ట్రాక్‌ల వద్ద ఈ సమస్య అధికంగా ఉంటోంది. తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి అర్ధరాత్రి 2 గంటల మధ్య రైలు కమ్మీలు చలి తీవ్రతకు బ్రేక్‌ అవుతుంటాయి. 

సిబ్బంది కొరతతో ఇబ్బంది
గుంతకల్లు డివిజన్‌ మొత్తం మీద 1354.27 కి.మీల రైలు మార్గం విస్తరించి ఉంది. ఈ మార్గాన్ని పర్యవేక్షించడానికి డివిజన్‌ పరిధిలో 23 ఇంజనీరింగ్‌ డిపోలు రేయింబవళ్లు పని చేస్తున్నాయి. అయినా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఐదేళ్లలో వేలాది మంది ఉద్యోగ విరమణ చేశారు. ఖాళీ పోస్టుల భర్తీ మాత్రం అంతంత మాత్రమే. ఇంజనీరింగ్‌ విభాగంలో మొత్తం 6031 పోస్టులు ఉండగా, కేవలం డివిజన్‌ వ్యాప్తంగా మొత్తం 4783 మంది మాత్రమే పని చేస్తున్నారు. మొత్తం మీద 1248 పోస్టులు ఖాళీ ఉన్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి. అసలే సిబ్బంది కొరత, దీనికి తోడు ఇంజనీరింగ్‌ విభాగంలో కొందరు సిబ్బంది గ్యాంగ్‌ల్లో పని చేయడం చేతకాక అధికారుల నివాస గృహాల్లో ఇంటి పనులు చేస్తూ సర్వీస్‌ను కొనసాగిస్తున్నారు. దురదృష్టవశాత్తు రైలు ప్రమాదాలు సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని సీనియర్‌ పర్యవేక్షకులు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. రైలు మార్గాలను అనునిత్యం పర్యవేక్షిస్తూ, పెట్రోలింగ్‌ విధులు నిర్వర్తిస్తూ రైలు ప్రమాదాలు నివారించాలంటే రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం తగినంత సిబ్బందిని నియమించాల్సి ఉంది. 

ఇప్పటి వరకు 11 ఘటనలు
నవంబర్‌ ఒకటి నుంచి డిసెంబర్‌ 6 వరకు గుంతకల్లు రైల్వే డివిజన్‌ వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో రైలు పట్టాలు విరిగినట్లు అధికారులు వెల్లడించారు. రైలు మార్గాలను అనునిత్యం పర్యవేక్షించడానికి ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది పని చేస్తుంటారు. ముఖ్యంగా రైల్వే లోకో సిబ్బంది (రైళ్ల డ్రైవర్లు, సహా డ్రైవర్లు) అప్రమత్తంగా లేకపోతే ఘోర ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. లోకో రన్నింగ్‌ సిబ్బంది ఏమాత్రం అజాగ్రత్త వహించినా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడం తథ్యం. రైలు కమ్మీలు విరగడం, వెల్డింగ్‌ ఊడిపోవడం వల్ల జరిగిన ప్రమాదాలు మచ్చుకు కొన్ని...
∙నవంబర్‌ 24న గుంతకల్లు రైల్వే జంక్షన్‌లోని 4వ నంబర్‌ ప్లాట్‌ఫారంలో రైలు కమ్మీల వెల్డింగ్‌ ఊడిపోయింది. లోకో పైలెట్‌ గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.
∙ఈ నెల 4న రామరాజుపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలు విరిగి ఉండటాన్ని కీమెన్‌ రాజు గుర్తించడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో కేకే ఎక్స్‌ప్రెస్, ధర్మవరం స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు.

మరిన్ని వార్తలు