పలు రైళ్ల రద్దు..

12 Oct, 2018 03:26 IST|Sakshi

స్టేషన్లలో ప్రయాణికుల పడిగాపులు

సరైన సమాచారం లేక ఇక్కట్లు  

తాటిచెట్లపాలెం(విశాఖపట్నం)/విజయనగరం గంటస్తంభం: తిత్లీ తుపాను బీభత్సానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు గురువారం రద్దయ్యాయి. రైల్వే ట్రాక్‌లపై చెట్లు పడిపోవడం, సిగ్నలింగ్‌ వ్యవస్థ దెబ్బతినడంతో ముందు జాగ్రత్తగా పలు రైళ్లను నిలిపివేశారు.

మరికొన్నింటిని దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. సంత్రగచ్చి–చెన్నై స్పెషల్, హౌరా–చెన్నై(కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌), హౌరా–యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు–భువనేశ్వర్‌(ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌), యశ్వంత్‌పూర్‌–భాగల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్, హౌరా–హైదరాబాద్‌(ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌), ఖరగ్‌పూర్‌–విల్లుపురం ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌–హౌరా(ఈస్ట్‌కోస్ట్‌) రైళ్లను గురువారం రద్దు చేశారు. అవసరం మేరకు రైళ్ల రద్దు, సమయవేళల్లో మార్పులు ఉంటాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.  

ప్రయాణికులకు అవస్థలు..
రైళ్ల రద్దుతో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు విశాఖ, విజయనగరం రైల్వే స్టేషన్లలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. పిల్లాపాపలు, లగేజీలతో ప్లాట్‌ఫాంల మీద పడిగాపులు కాస్తున్నారు. హెల్ప్‌లైన్‌ కింద ఏడు ఫోన్లు ఏర్పాటు చేసినప్పటికీ.. ఇద్దరు సిబ్బందినే కేటాయించడంతో ప్రయాణికులకు సరైన సమాచారం అందలేదు. కొద్దిసేపటికి వీరు కూడా ఫోన్లు తీసి పక్కన పెట్టేయడంతో సమాచారం చెప్పే దిక్కులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రైళ్ల సమాచారం కోసం ఎంక్వైరీ కౌంటర్ల వద్ద బారులుదీరారు. కాగా, భీకర గాలుల ధాటికి పలాస రైల్వే స్టేషన్‌ తీవ్రంగా దెబ్బతిందని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అధికారి ఒకరు చెప్పారు. పలుచోట్ల సిగ్నలింగ్‌ వ్యవస్థ పాడైందని వివరించారు. బరంపురం–కోటబొమ్మాళి మధ్య విద్యుత్‌ సరఫరా వ్యవస్థ దెబ్బతిందని పేర్కొన్నారు. ఆయా ప్రదేశాల్లో మరమ్మతు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.  


(విజయనగరం జిల్లాలో బస్సుపై కూలిన చెట్టు)

మరిన్ని వార్తలు