జేఎన్‌టీయూకు మహర్దశ

14 Aug, 2014 03:37 IST|Sakshi
జేఎన్‌టీయూకు మహర్దశ

యూనివర్సిటీ: జేఎన్‌టీయూ అనంతపురం ప్రగతి పథంలో పయనించడానికి అడుగులు వేస్తోంది. త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక సాధారణ బడ్జెట్‌లో జేఎన్‌టీయూకు నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేయనుంది. రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ నీలం సహాని పిలుపు మేరకు మంగళవారం వీసీ ఆచార్య కే లాల్‌కిశోర్, రిజిస్ట్రార్ కే హేమచంద్రారెడ్డిలు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఆ వివరాలను బుధవారం వీసీ ఆచార్య లాల్‌కిశోర్ వెల్లడించారు.

2013-14 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.200 కోట్లతో ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. ఆ కళాశాలను 300మంది విద్యార్ధులతో ప్రారంభించామని, 2015-16 విద్యా సంవత్సరానికి వీరి సంఖ్య 900 మందికి చేరుకుంటుందని చెప్పారు. అలాగే ఖాళీగా వున్న బోధనా పోస్టుల భర్తీకై ఆర్థిక పరమైన అనుమతులను బడ్జెట్‌లో పొందుపరచాలని కోరామన్నారు.

నూతనంగా రెండు కళాశాలలకు అటానమస్ హోదా
2014-15 విద్యా సంవత్సరానికి జేఎన్‌టీయూ పరిధిలోని మదనపల్లి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెన్సైస్, కడపలోని కేఎస్‌ఆర్‌ఎం కళాశాలలకు అటానమస్ హోదాను కల్పించారు. దీంతో జేఎన్‌టీయూఏ పరిధిలో 10 కళాశాలలకు అటానమస్ హోదా కల్పించినట్లైంది. జేఎన్‌టీయూ కాకినాడ, హైదరాబాద్‌ల కంటే ఎక్కువ అటానమస్ కళాశాలలను ప్రోత్సహిస్తున్న యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. అలాగే నూతనంగా తాడిపత్రి సీవీ రామన్ కళాశాలలో ఎంబీఏ కోర్సు ప్రారంభానికి అనుమతి ఇచ్చారు.
 
ఫుల్‌టైం పీహెచ్‌డీ ప్రోగ్రాంకు శ్రీకారం

ఈ విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీలో ఫుల్‌టైం పీహెచ్‌డీ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. అనుబంధ కళాశాలలకు కూడా ఈ విధానాన్ని వర్తింపచేయనున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది రీసెట్ నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు.

మరిన్ని వార్తలు