పోస్టింగ్ మా ఇష్టం !

2 Jan, 2014 02:23 IST|Sakshi
 సాక్షి, గుంటూరు :తాడికొండకు చెందిన మహిళ డి.స్వరూపరాణి మిలీనియం ఆస్పత్రిలోని ట్రామాకేర్ సెంటర్‌లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు దరఖాస్తు చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన ఆమె ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో డిప్లొమో (డీఎంఎల్‌టీ) చేశారు. 315 మార్కులతో 65.62 శాతం పర్సంటేజీ సాధించారు. గతంలో జీజీహెచ్‌లో 15 నెలలు పనిచేసిన అనుభవం ఉంది. అయితే అన్ని అర్హతలు వున్న స్వరూపరాణిని పక్కన పెట్టి అదే వర్గానికి చెంది 61.04 శాతం మార్కులు ఉన్న వేరే మహిళకు ఉద్యోగం ఇస్తూ లేఖ పంపారు. తన కంటే తక్కువ పర్సంటేజీ ఉండి, 
 
 అనుభవం లేని మహిళకు ఉద్యోగం ఇచ్చారని, తనకు న్యాయం చేయాలని స్వరూపరాణి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు (ఏపీవీవీపీ)అభ్యర్థుల ప్రతిభకు పాతర వేస్తూ ట్రామాకేర్ సెంటర్‌లో ఉద్యోగాల ఎంపిక నిర్వహిస్తోంది. స్థానికంగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి పొరుగు జిల్లాలో పనిచేస్తున్న అభ్యర్థులకు పెద్ద పీట వేస్తున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ట్రామాకేర్ సెంటర్‌లో ఉద్యోగాల ఎంపిక చేపట్టిన ఏపీవీవీపీ అధికారుల వ్యవహార శైలిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిభకు పాతర వేస్తూ చేపడుతున్న నియామకాల గురించి ఉన్నత స్థాయి వర్గాలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. 
 
 ఉద్యోగాల ఎంపికకు కేటాయించిన నిధులు మార్చిలోగా ఖర్చు చేయకుంటే వెనక్కు వెళతాయనే కారణంతోనే అడ్డగోలు నియామకాలు చేపడుతున్నారనే విమర్శలున్నాయి. మళ్లీ నోటిఫికేషన్.. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఉన్న ట్రామాకేర్ సెంటర్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 2009లో నిధులను విడుదల చేసింది. ఉద్యోగులకు అయ్యే ఖర్చులను ఐదేళ్ల పాటు భరిస్తామని పేర్కొంది. గుంటూరులోని జీజీహెచ్‌లో సెంటర్ భవనం కోసం రూ. 80 లక్షలు, వైద్య పరికరాల కోసం రూ. 5 కోట్లు, వైద్య సిబ్బంది వేతనాల కోసం రూ. 76 లక్షలను విడుదల చేసింది.  తొలుత వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని భావించిన వైద్యాధికారులు 2009లో ట్రామాకేర్ సెంటర్‌లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. 
 
 ఆ తరువాత ఉద్యోగాలు ఇవ్వటం మర్చిపోవటంతో నోటిఫికేషన్ పనికిరాకుండా పోయింది. సకాలంలో పోస్టులను భర్తీ చేయకుండా వైద్యాధికారులు ఆలస్యం చేసి, దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లారు. మళ్లీ మే 28న 2013లో ట్రామాకేర్‌లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. జనరల్, ఆర్థోపెడిక్ సర్జన్స్, క్యాజువాలిటి మెడికల్ ఆఫీసర్స్, మత్తు వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది ఇలా అన్ని కేడర్లకు కలిపి 71 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాల్సి ఉండగా, అంతా వారిష్టం అన్న రీతిలోనే సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దర ఖాస్తులను స్క్రూట్నీ చేసి కలెక్టర్ వద్దకు పంపించారు. జిల్లా కలెక్టరు బుధవారం అనుమతి ఇవ్వడంతో అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపుతున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి కొంతమందికి అన్యాయం జరగడంతో జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. 
 
 
మరిన్ని వార్తలు