ఖాకీగోల..!

6 Jun, 2019 13:37 IST|Sakshi

బదిలీలపై వణుకు గతంలో టీడీపీ నేతలకు వంత

అధికార అండతో వైఎస్సార్‌సీపీ నాయకులపై ప్రతాపం

ప్రభుత్వం మారడంతో తప్పిదాలపై టెన్షన్‌

పోస్టింగుల కోసం ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు

పార్టీలకు అతీతంగా ప్రజలకు అండగా ఉంటామనే నమ్మకం కలిగించాల్సినపోలీసు శాఖ గత ఐదేళ్లూ దారితప్పింది. ఆ శాఖలో కొందరు అధికారపార్టీ నేతలఅడుగులకు మడుగులొత్తారు. ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శించారు. ఇప్పుడు అలాంటి వారందరిలో వణుకు మొదలైంది. ప్రభుత్వం మారడంతో బదిలీలు ఉంటాయనే ఊహాగానాల నేపథ్యంలో తమ పోస్టులు ఏమవుతాయోనని గోల మొదలెట్టారు.ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలీసు శాఖలోని ఎస్సైల నుంచి సబ్‌డివిజన్‌ అధికారుల వరకూ కొందరు గత ఐదేళ్లూ టీడీపీ నేతల ప్రాపకం కోసం పాకులాడారు. ఆదాయం కోసం జిల్లాలోని ప్రధాన సర్కిళ్లలో పోస్టింగులు వేయించుకోవడానికి టీడీపీ నేతల చెంతన చేరారు. ఆ నాయకులు చెప్పినట్టల్లా చేశారు. ఆఖరికి ప్రజాప్రతినిధులకు ఇసుక, మట్టి మాఫియాల నుంచి పేకాట క్లబ్‌ల నుంచి డబ్బులు వసూలు చేసే బాధ్యత కూడా కొందరు తమ నెత్తిపై వేసుకున్నారు. వీరు పూర్తిగా అధికార పార్టీ నేతలు చెప్పినట్టల్లా ఆడారు. మాట వినని అధికారులను ప్రజాప్రతినిధులు బదిలీలతో భయపెట్టారు. ఒక ప్రజాప్రతినిధి ఏకంగా ఎస్సై స్థాయి అధికారిని కింద కూర్చోబెట్టడం, మరో ప్రజాప్రతినిధి దాడులకు తెగబడటంతో వారు కూడా అధికార పార్టీకి అనుకూలంగా మారిపోక తప్పని దుస్థితి జిల్లాలో నెలకొంది. సబ్‌ డివిజన్‌స్థాయి అ«ధికారుల తీరే అధికార పార్టీకి అనుకూలంగా ఉండటంతో కిందిస్థాయి అధికారులు వాళ్లను ఆదర్శంగా తీసుకుని రెచ్చిపోయారు. ఓ వైపు వైఎస్సార్‌ సీపీ శ్రేణులే లక్ష్యంగా కేసులు పెట్టడం,  మరోవైపు సివిల్‌ సెటిల్‌మెంట్లు, భూకబ్జాదారులకు అండగా నిలబడడం చేశారు. ప్రజా రక్షణ, శాంతిభద్రతలను పూర్తిగా విస్మరించారు.

రాజకీయ కనుసన్నల్లోనే బదిలీలు
గత ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో పోస్టింగ్‌లుఅన్నీ రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరిగాయి. స్థానిక ప్రజాప్రతినిధి ప్రమేయం లేకుండా పోస్టింగ్‌లు తెచ్చుకున్న అధికారులను బాధ్యతలు స్వీకరించకుండానే వెనక్కి తిప్పి పంపిన సందర్భాలు జిల్లాలో అనేకం. ఎన్నికల ముందు కూడా భీమవరం రూరల్‌ సీఐ నియామకంలో జరిగిన వివాదం అందరికీ తెలిసిందే.  ఇప్పుడు ప్రభుత్వం మారడంతో బదిలీలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కొందరు అధికారుల నిర్వాకాలు ఇవీ..
ఓ సబ్‌ డివిజన్‌ అధికారి ఇద్దరు ఎమ్మెల్యేలకు తొత్తుగా మారారు. వాళ్లు ఎంత చెబితే అంత అన్నట్టుగా వ్యవహరించారు. ఆఖరికి ఆ అధికారి ఇంట్లో జరిగే ఫంక్షన్లకు అన్ని వస్తువులూ సదరు ఎమ్మెల్యేల నుంచి వచ్చేలా వారితో మమేకమైపోయారు.
మరో డీఎస్పీ కోడి పందేల నుంచి భారీగా వసూళ్లకు తెగబడ్డారు. ప్రతి స్టేషన్‌కు ఇంతని వసూలు చేశారు. హోంమంత్రి బంధువు
కావడంతో అతని ఆగడాలకు అడ్డు
లేకుండా పోయింది. చివరికి ఎన్నికల ముందు బదిలీపై వెళ్లారు.
మరో సీఐ స్థాయి అధికారి గంజాయి వ్యాపారులతో సంబంధాలు పెట్టుకుని గంజాయి అక్రమ రవాణాకు సహకరించారు. చివరికి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి సస్పెండయ్యారు.
ఒక డీఎస్పీ స్థాయి అధికారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరైన బీసీ గర్జనకు పోలీసుల బందోబస్తు నామమాత్రంగా ఏర్పాటు చేయడంతో సభ నుంచి వెళ్లే సమయంలో జగన్‌మోహనరెడ్డి ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కున్నారు. ఆ రోజున నాలుగైదు గంటల సేపు సభకు వచ్చిన వారికి ట్రాఫిక్‌ కష్టాలు తప్పలేదు.  
దళితులపై వ్యాఖ్యలు చేసిన అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు పెట్టకుండా అతని ఒత్తిడిపై వైఎస్సార్‌ సీపీ నేతలను అరెస్టు చేసి స్టేషన్‌లో పెట్టి వేధింపులకు గురి చేశాడో అధికారి. గతంలో చింతమనేనిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తే, కేసు నమోదు చేసే విషయంలోనూ, ఆ తర్వాత విచారణ విషయంలోనూ పూర్తిగా చింతమనేనికి అండగా నిలబడ్డారు.
ఎన్నికల సమయంలో కీలక విభాగం చూసే డీఎస్పీ అధికారి ఒకరు పూర్తిగా వైఎస్సార్‌
సీపీ నాయకులు, కార్యకర్తలపైనే నిఘా పెట్టారు. ఆఖరికి అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్నారనుకున్న పోలీసు అధికారుల పక్కన కూడా షాడో బృందాలను ఏర్పాటు చేసి సామాజిక న్యాయం చాటుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.

పోస్టింగ్‌ కోసం ప్రయత్నాలు..!     
జిల్లాలో పాలనా విభాగం తర్వాత అంతటిప్రాధాన్యం ఉన్న పోలీసుశాఖలో ప్రస్తుతం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కలెక్టర్ల బదిలీలు జరగడం తర్వాత పోలీసు శాఖలో బదిలీలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని డీజీపీ గౌతం సవాంగ్‌ కలవడంతో బదిలీలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. గతేడాది బదిలీ వేటు పడిన వారు, ఎన్నికల ముందు జరిగిన బదీలీల్లో బయట జిల్లాలకు వెళ్లిన అధికారులు తమకు ఇష్టమైన ప్రాంతాలకు చేరేందుకు యత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల అండదండలతోరెచ్చిపోయిన ఆ పోలీసు అధికారులు ప్రస్తుతం పోస్టింగ్‌లు కాపాడుకోవడం కోసం నానా తిప్పలు పడుతున్నారు. కొత్తగా ఎన్నికైన వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని పోస్టింగ్‌ కోసం యత్నాలు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు