పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ 

14 Sep, 2019 04:33 IST|Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 

గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా అజయ్‌జైన్‌ నియామకం

ఫుడ్‌ ప్రాసెసింగ్, చక్కెర శాఖ కార్యదర్శిగా కాంతిలాల్‌ దండే

సాక్షి, అమరావతి: 19 మంది అఖిల భారత సర్వీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు  సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న  సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అజయ్‌ జైన్‌ గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఆంధ్రప్రదేశ్‌ గృహ నిర్మాణ సంస్థ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కూడా అజయ్‌ జైన్‌ కొనసాగుతారు. ఇప్పటి వరకూ గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగిన అనంతరామును సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇండియన్‌ రైల్వే అకౌంట్స్‌ సర్వీస్‌కు(ఐఆర్‌ఏఎస్‌) చెందిన ఎం.మధుసూదన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) వైస్‌ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్, బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీగా ఉన్న కాంతిలాల్‌ దండే (ఫుడ్‌ ప్రాసెసింగ్, చక్కెర) పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. పరిశ్రమల శాఖ కమిషనర్‌ సిద్ధార్థ జైన్‌ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా బదిలీ అయ్యారు. పరిశ్రమల శాఖ కమిషనర్‌గా ఎవరినీ నియమించకుండా తాత్కాలికంగా అంతర్గత ఏర్పాట్లు చేసుకోవాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది. 

మరిన్ని వార్తలు