టాస్క్‌ఫోర్స్‌ టైగర్‌కు వీడ్కోలు

2 Aug, 2019 08:11 IST|Sakshi
టాస్క్‌ఫోర్స్‌ ఐజీ కాంతారావును ఊరేగిస్తున్న ఆ శాఖ సిబ్బంది, అధికారులు  

బదిలీలు సాధారణం – టాస్క్‌ఫోర్స్‌ ఐజీ కాంతారావు

సేవలు మార్గదర్శకం – ఎస్పీ రవిశంకర్‌

సాక్షి, తిరుపతి అర్బన్‌: ఉద్యోగులకు బదిలీలు తప్పవని ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం (టాస్క్‌ఫోర్స్‌) ఐజీ మాగంటి కాంతారావు తెలిపారు. తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో గురువారం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. టాస్క్‌ఫోర్స్, అటవీ శాఖాధికారులు ఆయనను ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఐజీ కాంతారావు మాట్లాడుతూ, ఉద్యోగాలు విధుల్లో రాణించాలంటే సహచరులతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. ఆ విధానంతోనే తాను తిరుపతి డివిజన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఐజీగా 54 నెలల పాటు వృత్తిధర్మం నెరవేర్చానన్నారు. తిరుపతి కార్యాలయంతో పాటు అనేకమంది ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయన్నారు. ఏ ప్రాంతంలో విధులనేది కాకుండా, ఎంతమేరకు వృత్తిలో రాణిస్తున్నామనే అంశాన్ని గుర్తించుకోవాలన్నారు. తెలుగు రాష్టాల్లో అనేక ప్రాంతాల్లో ఉద్యోగం చేసినా, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంత సుదీర్ఘకాలం ఉద్యోగం చేసే భాగ్యం లభించడం తనకు లభించిన అదృష్టం అన్నారు.

టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ రవిశంకర్‌ మాట్లాడుతూ, తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ ఉద్యోగులకు ఐజీ కాంతారావు మార్గదర్శకులన్నారు. అనేక అంశాల్లో ఆయన తీరు మానవత్వానికి అద్దం పట్టిందన్నారు. టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి తన సొంత ఖర్చుతో క్యాంటిన్‌ ఏర్పాటు, సిబ్బంది చురుకుగా ఉండడానికి జిమ్‌ ఏర్పాటు చేయడం కాంతారావు మానవత్వానికి మచ్చుతునకలన్రాను. అటవీసంపదను కాపాడడంలో ఆయన కృషిని కొనియాడారు. అటవీశాఖ సీఎఫ్‌ఓ శరవణ్‌ మాట్లాడుతూ, ఐజీ కాంతారావు కిందిస్థాయి  నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల వరకు అనుబంధం పెంచుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీలు, ఆర్‌ఐలు, డీఎఫ్‌ఓలు, ఎఫ్‌ఆర్‌ఓలు పాల్గొన్నారు. బదిలీ అయిన టాస్క్‌పోర్స్‌ ఐజీ కాంతారావును గురువారం రాత్రి  కార్యాలయం నుంచి కపిలతీర్థం వరకు పోలీస్‌ వాహనంలో  ఊరేగించారు. ఉద్యోగులు ఆయనపై పూలవర్షం కురిపించి, అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీలు  వెంకటరమణ, వీ. అల్లాబక్ష, డీఎఫ్‌ఓలో నాగార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎస్పీకి బాధ్యతల అప్పగింత 
తిరుపతి డివిజన్‌ ఎర్రచందనంటాస్క్‌ ఫోర్స్‌ ఐజీ మాగంటి కాంతారావును రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర లీగల్‌ మెట్రోలజీ కంట్రోలర్‌గా నియమిస్తూ విజయవాడకు రెండు రోజుల క్రితం బదిలీ చేసింది. గురువారం ఆయన ఆ బాధ్యతలు టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ, అడిషనల్‌ కమాండెంట్‌ పీ.రవిశంకర్‌కు అప్పగించారు.

మరిన్ని వార్తలు