పడిగాపులు

21 Jun, 2016 01:46 IST|Sakshi

బదిలీల్లో గందరగోళం రాత్రి వేళ ఉద్యోగుల ఇక్కట్లు
ఐసీడీఎస్, ఇంజనీరింగ్ శాఖల్లో బదిలీలు జరిగినా మళ్లీ ఫైలు తెమ్మంటున్న కలెక్టర్

 

మచిలీపట్నం : ‘ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఒక విధంగా ఉన్నాయి.. జిల్లాలో మరో విధంగా నిబంధనలు విధించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగితే సహించేది లేదు.’  - ఇదీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ నేతల మధ్య చర్చ

 
‘పంచాయతీరాజ్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జాబితాలు సిద్ధం చేసి సోమవారం ఉదయం ఏడు గంటల కల్లా విజయవాడ తీసుకురమ్మన్నారు. దీంతో బదిలీలు అక్కడే ఉంటాయని విజయవాడ వెళ్లాం. మధ్యాహ్నం రెండు గంటలకు మచిలీపట్నంలోనే బదిలీల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. పడుతూ, లేస్తూ ఇక్కడికొచ్చాం. రాత్రి 8.30 గంటలైంది. ఇంతవరకు సీనియార్టీ జాబితాలు విడుదల చేయలేదు. జాబితా విడుదలైతేనే బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది.’ - పలువురు  ఉద్యోగుల మధ్య సంభాషణ ఇది

 
‘రాత్రి 8.15 గంటలైంది. మహిళా ఉద్యోగులను ఈ విధంగా ఇబ్బందిపెట్టడం ఎంతవరకు సమంజసం? బయట కూర్చుంటే దోమలు.. జెడ్పీ సమావేశపు హాలులో కూర్చుంటే ఉక్కపోత.. బీపీ, షుగర్‌తో బాధపడే ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఎప్పటికి బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది, ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పటికి ఇంటికి చేరాలి’  - ఇదీ మరికొందరు ఉద్యోగుల మధ్య చర్చ

 
బదిలీల కోసం సోమవారం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశపు హాలుకు వచ్చిన ఉద్యోగులు అర్ధరాత్రి వరకు నానా పాట్లు పడ్డారు. సోమవారంతో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా రాత్రి 8.30 గంటల వరకు సీనియార్టీ జాబితాలను ప్రకటించకపోవడంతో పడిగాపులు పడ్డారు. దోమల బాధ పడలేక, ఉక్కపోత తాళలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉన్నతాధికారుల మధ్య సమన్వయలోపం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.

 
మూడు రోజుల క్రితం ఇంజనీరింగ్ విభాగంలో, శని, ఆదివారాల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో బదిలీల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. అయినప్పటికీ ఈ రెండు శాఖల ఫైళ్లను తన వద్దకు తేవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయటంతో సోమవారం అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. యూనియన్ నాయకులు ఉద్యోగులకు సమాధానం చెప్పలేక, ఉన్నతాధికారులను ఒప్పించలేక సతమతమమయ్యారు. పంచాయతీరాజ్ మినిస్టీరియల్ విభాగంలోని ఉద్యోగుల బదిలీల వ్యవహారంపై కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్, సీఈవో మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్ ఉద్యోగుల బదిలీ ప్రక్రియను పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తామే నిర్వహిస్తామని జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్లి ఆయనను ఒప్పించారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ విజయవాడ నుంచి మచిలీపట్నంలోని జెడ్పీ కార్యాలయానికి మారింది. అయితే కలెక్టర్ నుంచి పంచాయతీరాజ్ ఉద్యోగుల సీనియార్టీ జాబితాలు సోమవారం రాత్రి 8.30 గంటల వరకు రాకపోవటంతో బదిలీల ప్రక్రియ ప్రారంభమే కాలేదు.

 
ప్రభుత్వం సాధారణ బదిలీలకు మార్గదర్శకాలను జారీ చేస్తూ ఐదేళ్లు ఒకే ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కావాలని పేర్కొంది. మూడేళ్లు ఒకే ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ ప్రక్రియను కాదని కలెక్టర్ బాబు.ఎ అందరు ఉద్యోగులు స్వీయ మదింపు వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని చెప్పటంతో గందరగోళం నెలకొంది. ఏ ప్రాతిపదికన సీనియార్టీ జాబితాలను తయారు చేస్తారనే అంశంపై సోమవారం రాత్రి 8.30 గంటల వరకు ఉద్యోగుల్లో ఉత్కంఠ ఏర్పడింది. బదిలీల ప్రక్రియపై పలువురు ఉద్యోగులను ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో తమకే తెలియటం లేదని చెప్పటం గమనార్హం.

మరిన్ని వార్తలు