ఉద్యోగుల బదిలీలు నేటి నుంచే.. 

25 Jun, 2019 05:15 IST|Sakshi

వచ్చే నెల 5లోగా ప్రక్రియ పూర్తి 

అదే నెల 6 నుంచి తిరిగి నిషేధం 

ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌ ఉత్తర్వులు

బదిలీల నుంచి విద్యాశాఖకు మినహాయింపు 

వచ్చే మార్చిలోపు  రిటైరయ్యే వారికి కూడా.. 

ఇప్పటికే విద్యా సంస్థలు ప్రారంభం కావడమే కారణం 

ఏసీబీ, విజిలెన్స్‌ కేసులతో పాటు ఇతర ఆరోపణలున్న వారిని కదిలించకూడదు 

ఆరోపణలు, ఫిర్యాదుల్లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహణ 

ఉద్యోగుల రిక్వెస్ట్, పాలనా సౌలభ్యమే ప్రాతిపదిక 

ఐదేళ్లు దాటితే తప్పనిసరి

సాక్షి, అమరావతి :  ఉద్యోగుల సాధారణ బదిలీలు మంగళవారం నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ బదిలీలకు అనుమతినివ్వగా.. ప్రస్తుతమున్న నిషేధాన్ని తొలగించారు. తిరిగి వచ్చే నెల 6న నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ సోమవారం జీవో జారీచేశారు. అయితే, ఇప్పటికే విద్యా సంస్థలు ప్రారంభమైనందున అన్ని రకాల విద్యాశాఖలను బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎటువంటి ఆరోపణలకు, ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా జీవోలో ప్రభుత్వం స్పష్టంచేసింది. ఉద్యోగుల రిక్వెస్ట్, పరిపాలనాపరమైన సౌలభ్యం ప్రాతిపదికగా బదిలీలు చేయాలని అందులో పేర్కొన్నారు. అలాగే, ఐదేళ్ల పాటు ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలన్నారు. 

ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న మార్గదర్శకాలు ఇవే.. 
- ఉద్యోగుల బదిలీల్లో 40 శాతం పైగా అంగవైకల్యం సర్టిఫికెట్‌ గల వారికి ప్రాధాన్యతనివ్వాలి 
ఉద్యోగుల పిల్లలు ఎవరైనా మానసిక వైకల్యంతో ఉంటే అలాంటి ఉద్యోగులను సంబంధిత వైద్య సదుపాయం గల ప్రాంతాలకే బదిలీ చేయాలి 
క్యాన్సర్, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి జరిగిన భార్యగాని ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నట్లయితే ఆ వైద్య సదుపాయాలున్న చోటకు మాత్రమే సంబంధిత ఉద్యోగులను బదిలీ చేయాలి. 
కారుణ్య నియామకాల్లోని వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యతనివ్వాలి. 
భార్యభర్తల కేసుల్లో భార్య బదిలీకి ప్రాధాన్యత ఇవ్వాలి. అదీ కూడా గతంలో ఈ సదుపాయం పొందినట్లయితే ఎనిమిదేళ్ల తరువాత మాత్రమే అనుమతించాలి. 
బదిలీలన్నీ రిక్వెస్ట్‌ కింద పరిగణనలోకి తీసుకోవాలి. 
పదోన్నతులు పొందిన ఉద్యోగులను బదిలీ చేయాలి. అయితే, బదిలీ చేసేచోట సంబంధిత పోస్టు ఉంటేనే చేయాలి. 
తొలుత అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫై చేయాలి. వాటిని భర్తీచేశాకే నాన్‌ ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీలు చేయాలి. 
ఐటీడీఏ ప్రాంతాల్లో పనిచేస్తున్న లోకల్‌ కేడర్, జోనల్‌ కేడర్‌ ఉద్యోగులను రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులను సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలకు ప్రాధాన్యతనివ్వాలి. 
ఐటీడీఏ ప్రాంతాల్లో పోస్టింగ్‌లకు ఉద్యోగులు 50 ఏళ్లలోపు వయస్సు గలవారై ఉండాలి. అలాగే, గతంలో ఐటీడీఏలో పనిచేయని వారై ఉండాలి.  
- ఐటీడీఏ పరిధిలోని మారుమూల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి. వీటిని బదిలీల ద్వారా భర్తీచేయడానికి సంబంధిత శాఖాధిపతులు, కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలి. 
అన్ని బదిలీలు సంబంధిత అథారిటీ ఆదేశాలు, నిబంధనల మేరకు జరగాలి. 
బదిలీ ప్రక్రియకు సంబంధిత శాఖాధిపతి బాధ్యత వహించాలి. ఎటువంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేకుండా నిబంధనలను ఉల్లంఘించకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి. 
రెవెన్యూ, ఇతర ఆర్జిత శాఖలైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్, రవాణా, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు కూడా ఆయా శాఖల మార్గదర్శకాల మేరకు వచ్చే నెల 5లోగా బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలి. 
వ్యవసాయ శాఖలో బదిలీలను మాత్రం ఆయా శాఖలకు అనుగుణంగా నిర్వహించుకోవచ్చు. 
స్కూలు విద్య, ఉన్నత విద్య, ఇంటర్మీడియట్‌ విద్య, సాంకేతిక విద్య, సంక్షేమ శాఖల విద్యా సంస్థలన్నింటిలో బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. 
ఇప్పటికే విద్యా సంస్థలు ప్రారంభమైనందున వీటిల్లో బదిలీలకు అవకాశం ఇవ్వలేదు. 

వీరిని బదిలీ చేయరాదు.. 
వచ్చే ఏడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులు.. అలాగే, గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల్లో పనిచేస్తున్న వారికీ బదిలీల నుంచి మినహాయింపు ఉంది.  
కంటిచూపు లేని ఉద్యోగులు ప్రత్యేకంగా వారు బదిలీకి రిక్వెస్ట్‌ చేస్తే తప్ప వారిని బదిలీ చేయరాదు. వారు కోరిన చోట స్పష్టమైన ఖాళీ ఉంటేనే బదిలీ చేయాలి. 
ఏసీబీ, విజిలెన్స్‌ కేసులు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులతో పాటు ఇతర శాఖాపరమైన ఆరోపణలున్న వారిని కూడా.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు