పోలీసు శాఖలో బదిలీల కాక

31 May, 2019 13:02 IST|Sakshi

ఎస్‌ఐ నుంచి డీఎస్పీ స్థాయి వరకు టెన్షన్‌

నచ్చిన స్టేషన్లు, ఆదాయం ఉండే విభాగాల్లో పోస్టింగ్‌ కోసం ప్రయత్నాలు      

ఆ శాఖ ఉద్యోగుల్లో జోరుగా సాగుతున్న చర్చ

కర్నూలు: రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖలో నాలుగైదు రోజులుగా ఎస్‌ఐ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు బదిలీ జ్వరం పట్టుకుంది. గత ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో పోస్టింగ్‌లు అన్నీ రాజకీయాల కనుసన్నల్లోనే జరిగాయి. స్థానిక ప్రజాప్రతినిధి ప్రమేయం లేకుండా పోస్టింగ్‌లు తెచ్చుకున్న అధికారులను బాధ్యతలు స్వీకరించకుండానే వెనక్కి తిప్పిపంపిన సందర్భాలు జిల్లాలో అనేకం. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో బదిలీలపై ఆసక్తి నెలకొంది.

చక్రం తిప్తేందుకు సీనియర్ల యత్నాలు  
జిల్లాలో పాలనా విభాగం తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న పోలీసుశాఖ పరంగా ప్రస్తుతం ఆసక్తి కర పరిణామాలు ఊపందుకున్నాయి. ఎక్కడిక్కడ చక్రం తిప్పే దిశగా కొందరు సీనియర్లు యత్నిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. గతేడాది బదిలీ వేటు పడిన వారు, ఎన్నికల ముందు జరిగిన బదీలీల్లో మార్పులు చేర్పులకు గురైన వారు కలిసి తమకు ఇష్టమైన ప్రాంతాలకు చేరేందుకు ఉవ్వీళ్ళూరుతున్నట్లు సమాచారం. ఎన్నికల ముందు వరుసగా మూడేళ్లు జిల్లాలో పని చేసిన సుమారు 25 మంది సీఐలు, 8 మంది డీఎస్పీలు బదీలపై పొరుగు జిల్లాలకు వెళ్లారు. వారంతా త్వరలోనే జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో వారు నచ్చిన స్టేషన్లు, ఆదాయం పుష్కలంగా ఉండే విభాగాల్లోకి చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఆ శాఖలో చర్చ సాగుతోంది. ఇపుడు అవకాశం కోల్పోతే మరో ఏడాదిపాటు ఆగాల్సి రావడంతో చాలామంది అధికారులు అవకాశాన్ని వదులుకోనేందుకు ఆసక్తి చూపడం లేదన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట.

పీఎస్‌ఐల పనితీరుపై నిశిత పరిశీలన..  
జిల్లాలో  ఏడుగురు ప్రొబేషనరీ ఎస్‌ఐలకు ఈ నెల 7వ తేదీన పోస్టింగులు కేటాయిస్తూ ఎస్పీ ఫక్కీరప్ప ఉత్తర్వులు ఇచ్చారు. శిక్షణలో ఉన్న ఏడుగురుతో పాటు వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న మరో 8 మందిపై బదీలీ వేటుపడింది. ఇందులో సీసీఎస్‌కు ఆరుగురు, వీఆర్‌కు ఇద్దరు బదీలీ అయ్యారు. పీఎస్‌ఐలో నలుగురు మహిళలు ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న మహిళ ఎస్‌ఐల పనితీరు ఏలా వుందన్న అంశంపై ఉన్నతాధికారులు నిశిత çపరిశీలన జరుపుతున్నారు. ప్రజా సంబంధాలు, కేసుల దర్యాప్తులో వ్యవహరించే తీరు, సాంకేతిక అంశాలపై పట్టు, ఎన్నికల సమయంలో వారి పనితీరు తదితర అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఆయా అంశాలపై నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రస్తుత బ్యాచ్‌లో ఐదుగురు మహిళ ఎస్సైలు ఉన్నారు. హలహర్వి, కోడుమూరు. దొర్నిపాడు, రేవనూరు, బండి ఆత్మకూరు స్టేషన్లలో వీరు విధులు నిర్వహిస్తున్నారు.     

పక్షపాతం చూపిన అధికారులు..
గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీకి కొమ్ముకాసి ఇతరులపై పక్షపాతం చూపిన కొందరు అధికారులు బదిలీలకు ముందే మూటముళ్లే సర్దుకుని సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సుమారు 45 మంది ఇన్‌స్పెక్టర్లు, నలుగురు సబ్‌ డివిజన్‌ అధికారులు తెలుగుదేశం కార్యకర్తల్లా వ్యవహరించారనే అపవాదు మూటకట్టుకున్నారు.  ఎన్నికల సందర్భంగా ఏకపక్షంగా తెలుగుదేశంకు కొమ్ముకాసిన వారంతా బదీలీలపై వెళ్లేందుకు మానసికంగా సిద్ధపడ్డారన్న చర్చ నడుస్తోంది. 

>
మరిన్ని వార్తలు