బదిలీల్లో రాజకీయ పైరవీలు

23 Jun, 2016 02:16 IST|Sakshi

విద్యుత్ శాఖలో ఇష్టారాజ్యం
లేఖ ఉంటే కోరిన చోటుకు  జిల్లాలో 64 మందికి  స్థానచలనం

 

తిరుపతి రూరల్: విద్యుత్ శాఖ బదిలీల ప్రక్రియలో ఇష్టారాజ్యంగా పైరవీలు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం బదిలీలకు అర్హత లేకపోయినా కొందరు అధికారులు అధికార పార్టీ నేతల లేఖలను పట్టుకుని కోరిన చోటుకు బదిలీ చేయించుకునేందుకు సర్కిల్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం గల్లీ నేతల సిఫారసులకు సలాం కొడుతున్నారు.

 
64 మందికి స్థాన చలనం

ఎస్పీడీసీఎల్ తిరుపతి సర్కిల్(జిల్లా) పరిధిలో సదరన్ డిస్కం మార్గదర్శకాల ప్రకారం అధికారులు లెక్కలు తీశారు. ఆ మేరకు జిల్లాలో డీఈల-4, ఏడీఈ-5, ఏఈ-27, సబ్ ఇంజినీర్లు-24, ఎస్‌ఏవో-1, ఏవో-2, ఏఏవో-2 ఇలా మొత్తం 64 మంది ఉన్నట్లు వారి జాబితాను ప్రకటించారు. జాబితాలో ఉన్న వారు బుధవారం సాయంత్రంలోపు ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాత పూర్వకంగా ఇవ్వాలని సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీరు హరనాథరావు సూచించారు. బుధవారం సాయంత్రానికి దాదాపు 26 వినతులు వచ్చినట్లు సమాచారం.

 
లేఖలదే పైచేయి..

ఏళ్ల తరబడి వివిధ స్థాయిలో పాతుకుపోయిన అధికారులు మళ్లీ అదే స్థానాల్లో పోస్టింగ్‌ల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. చంద్రగిరి నుంచి గతేడాది దూరంగా బదిలీ అయినా మాజీ మంత్రి ద్వారా తిరుపతిలో తిష్టవేసిన తిరుపతి రూరల్ మండలానికి చెందిన ఓ ఏడీఈ మళ్లీ చంద్రగిరి సబ్ డివిజన్‌కు వచ్చేందుకు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. తన సొంత గ్రామం పరిధిలోని సబ్ డివిజన్‌కు వచ్చేందుకు పుదిపట్లకు చెందిన ఓ చోటా నాయకుడికి ముడుపులు ముట్టజెప్పి సంపాధించిన మాజీ మంత్రి లేఖను ఇప్పటికే అధికారులకు అందించినట్లు తెలిసింది. బదిలీ కోసం సదరు ఏడీఈ తొక్కని అడ్డదారులు లేవు. తనను కోరిన చోటకు బదిలీ చేయిస్తే సర్పంచ్ అయిన తన సొంత తమ్ముడు, మరో రెండు ఇద్దరు ఎంపీటీసీ సభ్యులను పార్టీలో చేర్చుతానని హామీ ఇచ్చినట్లు సమాచారం. పీలేరు, మదనపల్లి, చిత్తూరు, పుత్తూరు డివిజన్లలో ఈ సిఫారసు లేఖల తాకిడి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

 

నిబంధనల ప్రకారమే..
నిబంధనల ప్రకారమే జిల్లాలో బదిలీలు జరుగుతున్నాయి. ఎక్కడా అతిక్రమించడం లేదు. బదిలీలకు అర్హులైన వారి జాబితాను ఇప్పటికే ప్రకటించాం. -హరనాథరావు, సూపరింటెండింగ్ ఇంజినీరు, తిరుపతి సర్కిల్, ఎస్పీడీసీఎల్

 

మరిన్ని వార్తలు