పొలిటికల్‌ పోస్టింగ్‌లకు రంగం సిద్ధం

27 Oct, 2018 12:08 IST|Sakshi

అనుయాయుల నియామకానికి నేతల పావులు

రెండు నెలల్లో పోలీసు శాఖలో భారీగా బదిలీలు, పోస్టింగ్‌లు

ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకోవడంలో అధికారుల బిజీ

అనంతపురం నగరంలో ఓ పోలీసుస్టేషన్‌కు ఇటీవల ఇతర జిల్లా నుంచి ఓ సీఐ బదిలీపై వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు తీసుకుంటేనే పోస్టింగ్‌ అన్నది పోలీసు శాఖలో నగ్నసత్యం. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ఈ సమయంలో ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఈయనకు వెంటనే బదిలీ ఉండకపోవచ్చునని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.  

అనంతపురం సెంట్రల్‌: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసు శాఖలో పొలిటికల్‌ పోస్టింగ్‌లకు రంగం సిద్ధమవుతోంది. సాధారణంగా ఎన్నికల కమిషన్‌ నిబంధనలను బేరీజు వేసుకొని బదిలీలు, పోస్టింగ్‌లకు పావులు కదుపుతున్నారు. రెండు, మూడు నెలల్లో తమ అనుయాయులకు పోస్టింగ్‌లకు ఇప్పించుకోవడం ద్వారా రానున్న ఎన్నికలకు లబ్ధి పొందాలని యోచిస్తున్నట్లు సమాచారం. పోలీసు శాఖలో ఉద్యోగుల బదిలీ విషయంలో పోలీస్‌బాస్‌ల పాత్ర నామమాత్రమనే అభిప్రాయం ఉంది. ఇది నేతలకు ఒకింత మేలు చేకూరుస్తోంది. ఎన్నికల సమయంలో మిగిలిన ప్రభుత్వశాఖల అధికారుల పాత్ర ఒక ఎత్తు అయితే పోలీసు పాత్ర మరో ఎత్తు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం కీలకంగా పనిచేయాల్సి ఉంటుంది.

ఎన్నికల సమయంలో సమస్యాత్మక గ్రామాల్లో విధులు కత్తిమీద సాములా మారుతుంది. అలాంటి కీలకమైన పోలీసుశాఖలో ఎప్పటి నుంచో పొలిటికల్‌ పోస్టింగ్‌లకు సాగుతున్నాయి. స్థానిక అధికారపార్టీ ఎమ్మెల్యేల సిఫార్సు లేకపోతే ఎస్‌ఐ నుంచి డీఎస్పీ వరకూ పోస్టింగ్‌లు దక్కని పరిస్థితి. దీంతో ప్రతి ఒక్కరూ ముందే ఆయా ఎమ్మెల్యేలను కలిసిన తర్వాత పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారు. ఇటీవల తాడిపత్రి, రాప్తాడు లాంటి నియోజకవర్గాల్లో పోలీసుల పనితీరును పరిశీలిస్తే ఇందుకు అవుననే సమాధానం లభిస్తోంది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే పనిచేసుకుంటూ పోతున్నారు. సాధారణ సమయంలోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇక ఎన్నికల సమయంలో పోలీసుల పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది. దీంతో తమకు నచ్చిన వారిని నియమించుకోవాలనే యోచనలో నేతలు ఉన్నారు.  

త్వరలో భారీగా మార్పులు చేర్పులు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. డిసెంబర్‌లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. మార్చిలోగా సార్వత్రిక ఎన్నికలు ఉంటాయని రాజకీయనాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పోలీసుశాఖలో భారీగా మార్పులు చేర్పులు చోటుచేసుకోనున్నాయి. ఎన్నికల సమయానికి ఎస్పీ అశోక్‌కుమార్‌ బదిలీ అయ్యే అవకాశముంది. ఈయన స్థానంలో నూతన ఎస్పీ రానున్నారు. అలాగే ఎస్‌ఐ నుంచి సీఐ, డీఎస్పీల వరకూ బదిలీలు జరగనున్నాయి. జిల్లాలో తాడిపత్రి డీఎస్పీ స్థానం ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. పెనుకొండ,  గుంతకల్లు, స్పెషల్‌ బ్రాంచ్‌–1 డీఎస్పీ స్థానాలు కొంతకాలంగా ఇన్‌చార్జ్‌ల పాలనలో సాగుతున్నాయి. వీరితో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో ఒకరిద్దరు మినహా దాదాపు అందరూ సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది. వీరి స్థానాల్లో కొత్తవారి నియామకం జరగనుంది. ఎస్‌ఐలు, సీఐలలో కూడా చాలామందికి స్థానచలనం కలగనుంది. దీంతో కొందరు ఇప్పటి నుంచే కీలకమైన స్థానాలకు వచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు