మంత్రి ఇంట బదిలీలలు!

2 Jun, 2017 15:42 IST|Sakshi
మంత్రి ఇంట బదిలీలలు!

అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలు పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్నాయి. ఆన్‌లైన్‌లో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన బదిలీల ప్రక్రియ మంత్రి కామినేని ఇంటికి చేరింది. విదేశాలకు వెళ్లిన మంత్రి బదిలీల గడువు సమీపించడంతో నిర్ణయించుకున్న తేదీ కంటే మూడు రోజులు ముందే రాష్ట్రానికి వచ్చారు. వచ్చీ రావడంతోనే రిక్వెస్ట్‌ బదిలీల పేరిట తన పేషీకి వచ్చిన 300కు పైగా దరఖాస్తులను తన ఇంటికి తీసుకురావాలని ఆదేశించారు.

గురువారం సాయంత్రం వరకూ కసరత్తు చేసి అనుకూలమైన వారితో జాబితా తయారు చేశారు. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ జాబితాను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆమోదించి ఈ నెల 4వ తేదీన ఆన్‌లైన్లో పెట్టనున్నట్టు తెలిసింది.

సీనియారిటి, ఒకే చోట ఎక్కువ కాలం పని చేస్తున్న ప్రాతిపదికన ఆన్‌లైన్‌లో కావాల్సిన బదిలీలు మంత్రి ఇంట్లో నిర్ణయం జరగడం బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు ఒకే చోట పని చేస్తుంటే రిక్వెస్టు బదిలీలు చేసుకోవచ్చు. 20 ఏళ్ల వరకూ ఒకే చోట ఉంటే ప్రభుత్వమే చేస్తుంది. ఒకే చోట ఐదేళ్లకు మించి పని చేస్తున్న వారు ఆన్‌లైన్‌ లాగిన్‌ కాలేకపోయారంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కింది స్థాయి ఉద్యోగులు బదిలీలు కావేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పదేళ్లుగా పనిచేస్తున్న వారి వివరాలు కంప్యూటర్‌లో కనిపించడం లేదు.

కౌన్సెలింగ్‌ అస్తవ్యస్తం
గొల్లపూడిలోని ప్రజారోగ్య కార్యాలయం ఎదుట గురువారం వైద్యులు నిరసనలు చేపట్టారు. బదిలీల్లో భాగంగా ప్రజారోగ్య కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కౌన్సెలింగ్‌ అస్తవ్యస్తంగా ఉందని, తమకు నచ్చిన వారికి పోస్టులు దక్కేలా చేశారని ఈ సందర్భంగా పలువురు వైద్యులు నినాదాలు చేశారు. ఇవి సాధారణ బదిలీలు కావని, అవినీతి బదిలీలంటూ నిరసన చేపట్టారు. సుమారు గంట సేపు కౌన్సెలింగ్‌ ప్రక్రియ గందరగోళంగా మారింది. 20 ఏళ్లుగా పట్టణాల్లో పని చేస్తున్న వారికి మళ్లీ పట్టణాల్లోనే వేశారని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారిని మళ్లీ అక్కడికే వేశారని ఆరోపించారు. ఈ బదిలీల్లో భారీగా నగదు చేతులు మారినట్టు వైద్యులు ఆరోపించారు.

మరిన్ని వార్తలు