‘ఆన్‌లైన్’పై వ్యతిరేకత పారదర్శకత పాతరకే!

26 Jun, 2013 04:53 IST|Sakshi

యాజమాన్యపు కోటా సీట్లను ఆన్‌లైన్ పద్దతిలో భర్తీ చేసే ప్రక్రియను పారదర్శకతకు పాతర వేసే ఉద్దేశంతోనే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అడ్డుకుంటున్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆన్‌లైన్ ద్వారా సీట్లను భర్తీ చేస్తే ఇప్పుడున్న లాభాలు ఎక్కడ రాకుండా పోతాయోననే అభ్యంతరాలు చెబుతున్నాయని వివరించింది. అందుకే యాజమాన్యాలు ఆఖరి నిమిషంలో కోర్టును ఆశ్రయించి, ఆన్‌లైన్‌లో సీట్ల భర్తీకి సంబంధించిన జీవో 66 అమలుపై స్టే పొందాయని తెలిపింది. దీనివల్ల కౌన్సెలింగ్ ప్రక్రియ అలస్యమవుతోందని, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ దృష్ట్యా జీవో 66పై స్టేను ఎత్తివేయాలని విన్నవిస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్.ఎం.దోబ్రియాల్ మంగళవారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. జీవో 66ను సవాలు చేస్తూ శ్రేయాస్ విద్యాసంస్థల చైర్మన్ వినయ్‌కుమార్‌రెడ్డి, అభివన్ హైటెక్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మరికొందరు పిటిషన్లు దాఖలుచేసిన సంగతి తెలిసిందే. వాటిని ఇటీవల విచారించిన హైకోర్టు ధర్మాసనం... జీవో 66 అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. 2007లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే యాజమాన్యపు కోటా సీట్లను ఆన్‌లైన్ ద్వారా భర్తీ చేసేందుకు జీవో జారీ చేశామని ఆ కౌంటర్‌లో పేర్కొన్నారు.  అది ప్రైవేటు కాలేజీల విషయాల్లో, వాటి పాలనలో జోక్యం చేసుకున్నట్లు కాదని నివేదించారు. ప్రైవేటు కాలేజీల దోపిడీకి అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రతిభ కలిగిన విద్యార్థులకు సీట్లు లభించేలా చేయడమే ఆన్‌లైన్ విధానం లక్ష్యమని ఆయన వివరించారు

మరిన్ని వార్తలు