పారదర్శకత కోసమే న్యాయ సేవా కేంద్రాలు

27 Oct, 2013 00:27 IST|Sakshi

సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: పారదర్శకతకు పెద్దపీట వేయాలనే సదుద్దేశంతో న్యాయ సేవా కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నామని హైకోర్టు న్యాయమూర్తి, పోర్టుపోలియో జడ్జి ఏవీ శేషసాయి అన్నారు. జిల్లా కోర్టులో రూ.2.49లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన న్యాయ సేవా కేంద్రాన్ని శని వారం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ న్యాయ సమాచార సేవల ద్వారా కక్షిదారులు, న్యాయవాదులు తమ కేసులకు సంబంధించిన పురోగతి, ఇతర వివరాలను ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చన్నారు. సంగారెడ్డిలో ప్రారంభమైన కేంద్రం ద్వారా ఇక్కడి పది కోర్టులకు సంబంధించిన కేసుల వివరాలను ఆన్‌లైన్ లో సులువుగా తెలుసుకోవచ్చన్నారు. జిల్లాలోని ఇతర కోర్టులకు సంబంధించిన కేసుల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో పొందుపర్చేం దుకు చర్యలు తీసుకోనున్నట్టు వివరించారు. ఈ సేవలను కక్షిదారులు, న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
 
 అందరి సహకారంతోనే..
 జిల్లా కోర్టులో న్యాయ సేవా కేంద్రం అందుబాటులోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని జిల్లా జడ్జి టి.రజని అన్నారు. న్యాయమూర్తులు, పాలన సిబ్బంది సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. న్యాయ సేవా కేంద్రం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జాయింట్ కలెక్టర్ శరత్ అన్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వివిధ కేసుల పురోగతిని ఆన్‌లైన్‌లో తెలుసుకునేందుకు వీలుకలుగుతుందని తెలిపారు. టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటుకు కలెక్టర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డిలో లేబర్ కోర్టుతోపాటు పెండింగ్ కేసుల పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు న్యాయమూర్తిని కోరారు.
 
 అనంతరం హైకోర్టు జస్టిస్ ఏవీ శేషసాయిని జిల్లా జడ్జి టి.రజని, బార్ అసోసియేషన్ నాయకులు సన్మానించా రు. కార్యక్రమంలో ఏఎస్పీ భూపాల్, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఆ తరువాత హైకోర్టు న్యాయమూర్తి శేషసాయి విలేకరులతో మాట్లాడుతూ న్యాయ సేవా కేంద్రం పనితీరును వివరించారు.

>
మరిన్ని వార్తలు