ఆ దందా సాగదిక...

28 Aug, 2019 10:45 IST|Sakshi

కొత్త మద్యం విధానంతో ప్రైవేటు పెత్తనానికి  చెల్లుచీటీ

లూజు విక్రయాలు, కల్తీ మద్యం కనుమరుగు

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణాల నిర్వహణ

అమ్మకాల్లోనూ కొనసాగనున్న పారదర్శకత

మద్యం వ్యాపారంలో ప్రైవేటు వ్యాపారుల దందాకు ఇక చరమ గీతం పాడనున్నారు. నిరుపేదలను నిలువునా మోసగించే చర్యలు ఇక సాగనివ్వరు. లూజు విక్రయాల పేరుతో దగా చేసే విధానానికి ఇక చెల్లు చెప్పనున్నారు. కల్తీ మద్యంతో అనారోగ్యం కొనితెచ్చుకోనక్కర లేదు. ప్రభుత్వమే ఇక మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నందున విక్రయాలన్నీ ఇక పారదర్శకమే.

సాక్షి, విజయనగరం రూరల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దశలవారీగా మద్యనిషేధం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మరో కీలకమైన అడుగు పడబో తోంది. తొలుత బెల్టుషాపులు నిరోధించి...కొంతవరకు పల్లెల్లో ప్రశాంతవాతావరణం నెలకొల్పారు. ఇప్పుడు మద్యం దుకాణాలు పూర్తిగా ప్రభుత్వపరంగానే నిర్వహించడంతో లూజు విక్రయాలు... కల్తీ మ ద్యానికి చెల్లు చెప్పనున్నారు. ప్రస్తుతం జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన 210 మద్యం దుకా ణాలు ప్రైవేటు వ్యాపారుల ఆధ్వర్యంలో నడుస్తున్నా యి. వ్యాపారులు మద్యం దుకాణాలకు టెండర్లు వేసిలాటరీ పద్ధతిలో దుకాణాలను దక్కించుకుని నిర్వహించారు. ప్రభుత్వం ఏడాది కాలానికి నిర్దేశించిన ఫీజును చెల్లించి వ్యాపారం కొనసాగించారు. దీనివల్ల మద్యం దుకాణాల్లో లాభార్జనే ధ్యేయంగా వ్యాపారం సాగేది. నిబంధనలు ఖాతరు చేయకుండా మద్యం దుకాణాల్లోనే లూజ్‌ విక్రయాలు చేసేవారు. దీంతో మద్యం విక్రయాల్లో కల్తీ జరిగి మందుబాబుల జేబులకు చిల్లు పడటమే కాకుండా మద్యం ప్రియుల ఆరోగ్యంపైనా ప్రభావం పడేది. అలాగే మద్యం దుకాణాలు రాత్రి 10 గంటల వరకు తెరిచేందుకు అనుమతులు ఉండటంతో ఆ సమయం వరకు అధికారికంగా మద్యం విక్రయాలు సాగించిన వ్యాపారులు రాత్రి 10 గంటల అనంతరం మద్యం దుకాణాల వెనుకనుంచి వారి సిబ్బందితో అనధికార విక్రయాలు సాగించేవారు.

ఇక విడి విక్రయాలు బంద్‌..
ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానం అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నిర్వహించనున్నారు. దీనివల్ల ఇక విడి విక్రయాలకు ఆస్కారం ఉం డదు. దీనివల్ల కల్తీ జరిగే అవకాశమే ఉండదని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. అలాగే మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటలకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అనధికార విక్రయాలకు ఆస్కారం ఉండదు. దీంతో మద్యం విక్రయాలు తగ్గే అవకాశం ఉండటం, దశలవారీ మద్య నిషేధానికి బాటలు పడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

కల్తీకి ఆస్కారం ఉండదు..
నూతన మద్యం విధానంలో విడి విక్రయాలకు ఆస్కారం లేనందు న మద్యంకల్తీ జరిగే అవకాశం ఉండదు. అలాగే జిల్లాలో ఉన్న 210 మద్యం దుకాణాలను 20 శాతం తగ్గించి 168కే పరిమితం చేశాం. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సిబ్బందిని నియమించడంతో వారు నిర్ణీత వేళల్లోనే పని చేస్తారు కాబట్టి అనధికార విక్రయాలు జరపడానికి వీలుపడదు.
– వై.బి.భాస్కరరావు, అబ్కారీశాఖ డిప్యూటీ కమిషనర్, విజయనగరం

మరిన్ని వార్తలు