పారదర్శకంగా పని చేయిస్తా..

5 Dec, 2015 00:48 IST|Sakshi

ఉన్నత స్థాయి అధికారులే వ్యవస్థకు ఆదర్శం
నాగార్జున వర్సిటీతో 30 సంవత్సరాల అనుబంధం
వృత్తి నైపుణ్యం, ఉపాధి  కల్పనకు ప్రత్యేక చర్యలు
విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీకి ఆన్‌లైన్ విధానం
ఏఎన్‌యూ ఇన్‌చార్జి వీసీ ఆచార్య వీఎస్‌ఎస్ కుమార్

 
ఏఎన్‌యూ: ఏ వ్యవస్థకైనా ఉన్నత స్థాయి అధికారులే ఆదర్శమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) ఇన్‌చార్జి వీసీ ఆచార్య వెల్లంకి సాంబశివకుమార్ అన్నారు. ఏఎన్‌యూ ఇన్‌చార్జి వీసీగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.  వర్సిటీలో అవినీతిని  రూపుమాపేందుకు ప్రత్యేక కార్యాచరణ ఏమీ అవసరం లేదని తాను ఉన్నన్ని రోజులు పారదర్శకంగా పనిచేస్తూ కింది స్థాయి వారితో కూడా పని చేయిస్తానన్నారు. ఏఎన్‌యూతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. 1984 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం, వివిధ తనిఖీలు, ప్రత్యేక కమిటీలు తదితర విధులకు తాను ఏఎన్‌యూలో బాధ్యత వహించానన్నారు. ఏఎన్‌యూకు చెందిన అధికారులు, అధ్యాపకులతో మంచి పరిచయాలు ఉన్నాయని ఇతర యూనివర్సిటీకి ఇన్‌చార్జిగా వచ్చానన్న భావన తనకు లేదన్నారు.

ఆర్ట్స్ కోర్సుల విద్యార్థులకు కూడా మంచి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు దోహదం చేసే భాష, భావ వ్యక్తీకరణ అంశాలపై శిక్షణను వీలైనంత మేరకు ఉచితంగా అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఏఎన్‌యూ నుంచి విద్యార్థులకు వివిధ సర్టిఫికెట్లు, పత్రాల పంపిణీలో ఆన్‌లైన్ డెలివరీ విధానాన్ని అతి త్వరలో ప్రవేశ పెడతానన్నారు. విద్యార్థులు యూనివర్సిటీకి రాకుండా ఇంటివద్ద నుంచే సర్టిఫికెట్లు పొందే విధంగా ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెస్తానని వెల్లడించారు. ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులు ఇస్తుందని ఏఎన్‌యూ అధ్యాపకులు మంచి ప్రాజెక్టు సిద్ధం చేస్తే ఢిల్లీలో ఆమోదింపజేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు