తిరగడానికి వీలులేని వాహనాలను తిప్పుతున్నారు

5 Mar, 2020 14:47 IST|Sakshi

సాక్షి, విజయవాడ : నిబంధనలకు విరుద్ధంగా బిఎస్‌-3 వాహనాలను స్క్రాప్‌ కింద కొనుగోలు చేసి అక్రమ ధ్రువ పత్రాల ద్వారా ఆంధ్రపదేశ్‌లో తిప్పడంపై ట్రాన్స్‌పోర్ట్ విజిలెన్స్ జాయింట్ కమిషనర్ ప్రసాద్ గురువారం మీడియాతో మాట్లాడారు. బిఎస్-౩ వాహనాలు 31-03-2017 తరువాత అమ్మకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని అన్నారు. అశోక్ లైల్యాండ్ నుంచి బీఎస్-3 వాహనాలు కొనుగోలు చేసి తిప్పుతున్నట్లు తెలిసిందన్నారు. 66 వాహనాలు స్క్రాప్‌గా అమ్మడం జరిగిందని, అశోక్ లైల్యాండ్ వాళ్లు తెలిపారని చెప్పారు. దేశంలో తిరగడానికి వీలులేని వాహనాలను తిప్పుతున్నారని,  పోలీసుల సర్టిఫికెట్‌లు కూడా దొంగవి పెట్టారన్నారు. పోలీస్ శాఖ కూడా క్రిమినల్ కేసులు కూడా పెట్టిందని తెలిపారు.  25 వాహనాలు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్న కారణంగా ఆ రాష్ట్రాలలో కూడా లావాదేవీలు నిలిపివేయాలని కోరామన్నారు.

ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..  ‘‘ అక్రమ ధ్రువ పత్రాలు ఉన్న వాహనాలను సీజ్ చేసే ప్రక్రియ మొదలు పెట్టాం. ఇప్పటికి 23 వాహనాలు సీజ్ చేసాం.వాహనాలు కొని మోసపోయిన వారు అమ్మిన వారిపై కేసులు పెట్టాలని సూచించాం. జఠాధర ఇండస్ట్రీస్‌, సి గోపాల కృష్ణ కంపెనీకి చెందిన 80 బస్సులు ఉన్నాయి. లారీలు తీసుకువచ్చి బస్సులు కింద మార్చారు. ఆ బస్సుల్లో ప్రయాణం ప్రాణాంతకం. 88 వాహనాలకు సంబంధించి 3 కేసులు నమోదు అయ్యాయి. 23 వాహనాలకు సంబంధించి రవాణా శాఖ అధికారుల ప్రమేయం ఉన్నా వారిని వదిలే ప్రసక్తి లేదు.

ఆగష్టు 2018న నాగాలాండ్‌లో ఈ వాహనాలు రిజిష్టర్ చేశారు. 45 వాహనాలు ఏపీలోనే ఉన్నాయని తెలిసింది. గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ పేరిట 45 వాహనాలు, మిగిలినవి జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట రిజిష్టర్ చేశారు. పీఆర్ హిల్ కోహిమా అని అడ్రస్ ఇచ్చారు, తాడిపత్రిలో పర్మనెంట్ అడ్రస్ ఇచ్చారు. జె.సి.ఉమారెడ్డి నాలుగు వాహనాలకు సంతకం చేశారు. సి.గోపాల్ రెడ్డి రెండు వాహనాలకు సంతకం చేశారు. నాగాలాండ్‌లో రిజిష్టర్ చేస్తే పట్టుబడమని అనుకున్నారు. అక్కడి నుంచి ఎన్‌ఓసీ కింద ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయి. అనంతపురంలో ఒక క్రిమినల్ కేసు వేశాము. ఇన్సూరెన్స్ కూడా దొంగ ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఏప్రిల్ 2020 నుంచీ బీఎస్ - 6 కాకపోతే తిగడానికే వీలు లేదు. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 182 ప్రకారం మేనుఫ్యాక్చరర్ తప్పుంటే చర్యలు తీసుకుంటాం. తప్పుడు పత్రాలు కనుక.. రిజిస్ట్రేషన్ రద్దు చేసి, ఇతర రాష్ట్రాలకు కూడా తెలిపాం. 

చట్ట వ్యతిరేకంగా తిరుగుతున్న వాహనాలు కనుక ఇప్పటి వరకూ 23 వాహనాలు సీజ్ చేశాం. లారీలను బస్సులుగా మార్చడంతో క్రిమినల్ కేసు నమోదు. ఏపీలోనే 29 రిజిష్టర్ కావడంతో, ట్రాన్స్‌పోర్ట్ అధికారులెవరైనా చర్యలు తప్పవు. అనంతపురంలోనే 29వాహనాలు రిజిష్టర్ అయ్యాయి. లారీ ఛాసిస్ తో మూడు బస్సులుగా మార్చారు. వాహనాలన్ని సి గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ, జఠాధర కంపెనీ కింద రిజర్వేషన్లు అయ్యాయి. 6 వాహనాలకు సంబంధించి వాహన యజమానులతో పాటు అశోక్ లైలాండ్‌ కంపెనీపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేశాం. దొంగ ఇన్సూరెన్స్‌లు పెట్టారు. యునైటెడ్ చీఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో కూడా ఈ విషయంపై మాట్లాడుతున్నాం . ఈ వ్యవహారంపై జాయింట్ కమిషనర్ నేతృత్వంలో యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశార’ని తెలిపారు.

మరిన్ని వార్తలు