‘బండంత నిర్లక్ష్యం..!

31 Aug, 2015 02:48 IST|Sakshi
‘బండంత నిర్లక్ష్యం..!

మోటర్ సైకిల్‌పై ముగ్గురు ఎక్కితే బ్రేక్ ఇన్‌స్పెక్టర్, పోలీసులు అస్సలు ఒప్పుకోరు. హెల్మెట్ లేకుండా ప్రయాణం ప్రమాదం కదా అంటూ  బండి ఆపి మరీ  ఫైన్ మీద ఫైన్‌లు వేస్తుంటారు. టన్నుల కొద్దీ గ్రానైట్ రాళ్లు వాహన సామర్ధ్యానికి మించి రెండు రెట్లు తీసుకుపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప సంబంధిత యజమానులపై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.  
- గ్రానైట్ రాళ్లతో అడ్డగోలు రవాణా
- రోజుకు వంద నుంచి 120 లారీల్లో గ్రానైట్ రాళ్ల రవాణా
- నిబంధనల మేరకు 50 టన్నులకు మించకూడదు..
- కానీ 80-100 టన్నుల వరకు తీసుకు వస్తున్న వైనం
- చోద్యం చూస్తున్న అధికారులు
చీమకుర్తి:
గ్రానైట్ రాళ్లను సామర్ధ్యానికి మించి చీమకుర్తి, బల్లికురవ నుంచి ఒంగోలులోని సూరారెడ్డిపాలెం, చెన్నై వైపు రోజుకు 100-120 లారీలు సామర్ధ్యానికి మించిన రాళ్లతో రవాణా చేస్తున్నారు. గరిష్టంగా 50 టన్నులకు మించి రవాణా చేయకూడదని రవాణాశాఖాధికారుల నిబంధనలు తెలియజేస్తున్నా, బాడుగకు ముఖం వాచిన లారీ యజమానులు వాహన సామర్ధ్యానికి మించి 80-100 టన్నుల వరకు రవాణా చేస్తున్నారు. అదే సమయంలో వాలు వంక లేని గ్రానైట్ రాళ్లను లారీ ప్లాట్‌ఫారం బయటకు పొడుచు కొచ్చే విధంగా లోడు చేసుకుని రోడ్డుపక్కల ప్రయాణం సాగిస్తూ ఇతర వాహనదారులకు ఆందోళన కలిగిస్తున్నారు.

ఒక క్యూబిక్ మీటరు  రాయి నాణ్యతను బట్టి 3-5 టన్నుల బరువు ఉంటుంది. ఇటీవల ఎస్‌ఎస్‌ఎన్ కాలేజీ వద్ద జారిపడ్డ గ్రానైట్ రాయి సుమారు 10-12 టన్నుల బరువు ఉండవచ్చు. అంత బరువు ఉన్న గ్రానైట్ రాయి కాలేజీ ముందున్న స్పీడ్ బ్రేకర్ వద్ద లారీకి బ్రేక్ వేయడంతో లారీ నుంచి జర్రన జారి రోడ్డు మార్జిన్‌లో పడింది. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక గ్రానైట్ క్వారీలలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కర్నూల్‌రోడ్డు మీదుగానే పట్టపగలు 20-30 టన్నుల బరువు ఉండే రాళ్లను రవాణా చేస్తున్నారు. ఒక వేళ కంటైనర్‌లో లోడు చేసినా అతివేగంతో నడిపితే అనుకోకుండా బ్రేకులు వేయాల్సి వస్తే గ్రానైట్ రాళ్లు ఉన్న కంటైనర్ జారీ కిందపడిన సంఘటనలు ఉన్నాయి. రోజూ పత్రికల్లో ఇలాంటి కథనాలు వచ్చినా రెండు, మూడు రోజులు బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌లు కాస్త హడావుడి చేస్తున్నారే తప్ప పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కఠినంగా నిబంధనలు అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
 
యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తున్నాం
- ఆర్‌టీవో రాంప్రసాద్

గ్రానైట్ వాహనాల రవాణాపై త్వరలో యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తున్నాం. ట్రాన్స్‌పోర్ట్‌కి ఒంగోలుకి డిప్యూటీ కమిషనర్ కూడా కొత్తగా రానున్నారు. ఆయన రాగానే రవాణాపై ఎలాంటి నిబంధనలు పాటించాలనే దానిపై మార్గదర్శకాలను రూపొందిస్తాం.

మరిన్ని వార్తలు