ట్రావెల్ దందా

12 Jan, 2015 07:48 IST|Sakshi
ట్రావెల్ దందా
  • ప్రయాణికులకు పండుగ పాట్లు
  • ప్రైవేట్ బస్సుల్లో మూడు రెట్లు పెరిగిన టికెట్ ధరలు
  • ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లోనూ 50 శాతం అదనపు చార్జీ వసూలు
  • తనిఖీలు నిర్వహించని రవాణా శాఖ
  • సాక్షి, విజయవాడ : జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్ల పండుగ దందాకు తెరలేచింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ముందుగానే సీట్లన్నీ రిజర్వ్ అయ్యాయి. దీంతో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు టికెట్ ధరలను రెండు, మూడు రెట్లు పెంచి అడ్డగోలుగా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా హైదారాబాద్ నుంచి విజయవాడ, నగరం నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సుల్లో టికెట్ల ధరలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి.

    ఓల్వో, స్లీపర్ బస్సుల టికెట్ ధరలు విమానం టికెట్ రేట్లతో పోటీపడుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఓల్వో     బస్సులో చార్జీ రూ.1,500 వరకు, నగరం నుంచి వైజాగ్‌కు రూ.1,900 వరకు వసూలు చేస్తున్నారు. శనివారం నుంచి మొదలైన ఈ తరహా దోపిడీ ఆదివారానికి మరింత పెరిగింది. ఇదే పరిస్థితి మంగళవారం వరకు కొనసాగే అవకాశం ఉంది. పండుగ అనంతరం 16 నుంచి 18వ తేదీ వరకు కూడా ప్రయాణికులకు ఈ తరహా కష్టాలు తప్పవు. ఈ దందాను అడ్డుకోవాల్సిన రవాణా శాఖ అధికారులు పూర్తిగా ఆధార్ సీడింగ్ ప్రక్రియలో నిమగ్నమవడంతో ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది.
     
    రెండు, మూడు రెట్లు ఎక్కువగా..

    ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు జిల్లా నుంచి నిత్యం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం తదితర నగరాలతోపాటు రాష్ట్రంలోని 13 జిల్లాలకు బస్సులు నడుపుతున్నారు. విజయవాడ నుంచి అన్ని ముఖ్య నగరాలకు రోజూ 250 బస్సులు వెళ్తుంటాయి. పండుగ సమయాల్లో మరో 100 బస్సుల వరకు ఏర్పాటుచేస్తారు. ఈక్రమంలో సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని శనివారం నుంచి మంగళవారం వరకు ప్రత్యేక సర్వీసులు కూడా పెంచారు.
     
    సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు ఏసీ బస్సులో టికెట్ రూ.550 కాగా, పండుగ రద్దీ పేరుతో రూ.1,000 నుంచి 1,500 వరకు వసూలు చేస్తున్నారు. నగరం నుంచి విశాఖపట్నానికి సాధారణ రోజుల్లో చార్జీ రూ.600 కాగా, ప్రస్తుతం 1,200 నుంచి రూ.1,900 వరకు పెంచేశారు.  
     
    మంత్రి చెప్పినా...

    ప్రైవేటు ట్రావెల్ ఆపరేటర్లు టికెట్లను అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకుంటామని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఇటీవల చెప్పారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లోనూ టికెట్ల ధరలు ఒకేలా ఉండేలా చూస్తామని ప్రకటించారు. మంత్రి మాటలను అటు ఆర్టీసీ గానీ, ఇటు ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్లు గానీ, పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చెందిన బస్సుల్లో ఇష్టానుసారంగా టికెట్‌లను అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఆర్టీసీలో ప్రత్యేక సర్వీసుల పేరుతో టికెట్ ధరలో 50 శాతం ఎక్కువగా వసూలు చేస్తున్నారు.
     
    ఆర్టీసీ టార్గెట్ కోటి రూపాయలు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా పండుగను సొమ్ము చేసుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి 13 వరకు, 16 నుంచి 18 వరకు స్పెషల్ బస్సులు నడిపి టికెట్లను అధిక ధరకు విక్రయించడం ద్వారా కోటి రూపాయల ఆదాయం పొందాలని విజయవాడ రీజియన్ అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. ఈ మేరకు బస్సులు తిరుగుతున్నాయి.
     
    సాధారణంగా హైదారాబాద్‌కు రోజు ఇక్కడి నుంచి 225, విశాఖపట్నం వైపు 110 బస్సులు వచ్చివెళ్తుంటాయి. పండుగ రద్దీ దృష్ట్యా శని, ఆదివారాల్లో రాజమండ్రి, విశాఖపట్నం వైపు అదనంగా 50 బస్సులు, హైదరాబాద్‌కు 70 బస్సులను పంపి అక్కడి నుంచి ప్రయాణికులను తీసుకొచ్చేలా చర్యలు తీసుకున్నారు. సోమవారం, మంగళవారాల్లో విశాఖపట్నం రూట్‌కు 150, హైదరాబాద్‌కు 100 బస్సులను ఏర్పాటు చేశారు. పండుగ తర్వాత 16 నుంచి 18 వరకు మరో 20 శాతం బస్సులను పెంచాలని నిర్ణయించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ టికెట్ ధర కన్నా 50 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. గత ఏడాది కూడా ఇతే తరహాలో ప్రత్యేక బస్సులు నడపడంతో ఆర్టీసీకి రీజియన్ పరిధిలో రూ.80లక్షల ఆదాయం వచ్చింది.  
     

మరిన్ని వార్తలు