నేటితో ఖజానా చెల్లింపులకు బ్రేక్

24 May, 2014 01:04 IST|Sakshi
నేటితో ఖజానా చెల్లింపులకు బ్రేక్

- ప్రభుత్వ ఆదేశాలు జారీ విభజన నేపథ్యంలో చెల్లింపులపై కొరవడిన స్పష్టత
- పింఛన్ల పంపిణీకి ముందస్తు ఏర్పాట్లు అభివృద్ధి పనుల బిల్లుల మంజూరుకు ఆటంకాలు

 సాక్షి, గుంటూరు, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖజానా శాఖ నుంచి చెల్లింపులకు నేటితో బ్రేకులు పడనున్నాయి. శనివారం సాయంత్రం తర్వాత ఎలాంటి బిల్లులకు చెల్లింపులు జరపరాదని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఉద్యోగులకు జీతాలు, డీఏలు, పెన్షన్‌దారులకు పింఛన్లు ముందస్తుగానే చెల్లించేందుకు ట్రెజరీ అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం గడువు కావడంతో ట్రెజరీ అధికారులు నానా హైరానా పడుతున్నారు.

ఉద్యోగులు,పన్షన్‌దారులకు చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వడంతో జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల మంజూరుకు ఆటంకాలు ఏర్పడనున్నాయి. ఈ నెల 19 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో జిల్లాలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. రోడ్లు, మంచినీటి పథకాలు, గోడౌన్లు, స్త్రీ శక్తి భవనాలు, అంగన్‌వాడీ, పాఠశాల భవనాలు తదితరాలకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్, హాస్టల్ డైట్స్‌కు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. జూన్ 2 రాష్ట్ర విభజనకు అపాయింటెడ్ డేట్ కావడంతో ఆ తర్వాతైనా బిల్లుల చెల్లింపులు చేస్తారా అన్న అంశంపై ఖజానా అధికారులకు స్పష్టత లేదు.

ఆర్నెల్ల నుంచి జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నమైంది. అభివృద్ధి పూర్తిగా పడకేసింది. ఈ సమయంలో ట్రెజరీ నుంచి విడుదల కావాల్సిన నిధులు అందకపోవడంతో జిల్లాలో ముఖ్యంగా తాగునీటికి సమస్యలు ఏర్పడనున్నాయి.

ప్రతి నెలా ట్రెజరీ ద్వారా రూ.536 కోట్ల చెల్లింపులు..
జిల్లాలో ప్రతి నెలా ట్రెజరీ ద్వారా రూ.536 కోట్లు చెల్లింపులు జరుగుతున్నాయి. రూ.236 కోట్లు ట్రెజరీకి ఆదాయం జమ అవుతోంది. జిల్లాలో 42 వేల మంది ప్రభుత్వోద్యోగులు, 40 వేల మంది పెన్షన్‌దారులున్నాయి. వీరికి ప్రతి నెలా రూ.252 కోట్ల మేర జీతాలు, డీఏ, పింఛన్లు చెల్లింపులు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రంతో ఖజానాకు తాళం పడనుండటంతో ట్రెజరీ అధికారులు బిజీగా మారారు. జూన్ 2 తర్వాత యథావిధిగా చెల్లింపులు జరిపేందుకు ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని ట్రెజరీ అధికారులు  పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు