అర్ధరాత్రి ఆపద వస్తే... అంతే!

14 Feb, 2019 08:55 IST|Sakshi

జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సేవలు ప్రశ్నార్థకమే...

రోగుల బాధలు పట్టించుకోని వైద్య సిబ్బంది

తరచూ వీటిపై ఫిర్యాదులు వచ్చినా...మారని తీరు

ఉన్నతాధికారులు సైతం కిమ్మనని వైనం

సాక్షాత్తూ మహిళా న్యాయమూర్తికే తాజాగా ఎదురైన చేదు అనుభవం

అది జిల్లాకే పెద్ద దిక్కుగా భావిస్తున్న పెద్దాస్పత్రి. ఏ సమయాన అక్కడకు వెళ్లినా... పూర్తిస్థాయి వైద్యం అందుతుందని అందరి నమ్మకం. అన్నిరకాల సమస్యలకూ వైద్యం లభిస్తుందనీ... ఖరీదైన పరీక్షలు ఇక్కడ చౌకగా చేస్తారనీ... ఆధునిక వైద్యపరికరాలు అందుబాటులో ఉంటాయని... అందరూ ఆశపడతారు. కానీ అవన్నీ ఊహలకే పరిమితమని అక్కడకు వెళ్లేవారికి అర్థమవుతుంది. అర్ధరాత్రి వేళ ఆపద వచ్చిందా... అక్కడకు వెళ్తే తీరని నిరాశే ఎదురవుతుంది. వైద్యసిబ్బంది పట్టించుకోరు. అవసరమైన చికిత్స అందించరు. దీనివల్ల ఎక్కువమంది ప్రైవేటు వైద్యశాలలనే ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ మహిళా న్యాయమూర్తి ఛాతీలో నొప్పి వస్తోందని వెళ్తే అక్కడి వైద్యులు పట్టించుకోకపోవడంతో ఈ ఆస్పత్రి మళ్లీ చర్చనీయాంశమైంది.

విజయనగరం ఫోర్ట్‌: రోగులకు పెద్ద దిక్కుగా నిలవాల్సిన జిల్లా కేంద్రాస్పత్రిలో సేవలు మృగ్యమవుతున్నాయి. అక్కడి సిబ్బంది వ్యవహార శైలివల్ల తరచూ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే వైద్య సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనీ, ఎంతటి స్థాయి వ్యక్తులు వెళ్లినా నిర్లక్ష్యం వీడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి పుణ్యమాని చిన్నపాటిఅనారోగ్యానికే ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్న వాదన వినిపిస్తోంది. కేంద్రాస్పత్రిలో రాత్రి వేళ విధులు నిర్వర్తించే వైద్య సిబ్బంది కాలక్షేపానికే వస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రోగులు వచ్చి తమ బాధలు చెప్పుకున్నా పట్టిం చుకోవడం లేదనీ, సెల్‌ఫోన్లో చాటింగ్‌లతోనే కా లం గడుపుతున్నారనీ, లేదంటే గదిలోకి వెళ్లి నిద్రపోతున్నట్టు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి.

రోగులకు దక్కని భరోసా...
జిల్లాలో అతి పెద్ద  ప్రభుత్వాస్పత్రి కావడంతో ని త్యం అధిక సంఖ్యలో ఇక్కడకు రోగులు వస్తారు. పాముకాటు బాధితులు,శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు, ప్రమాదంలో గాయపడ్డవారు, శ్వాస ఆడని రోగులు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు రాత్రి వేళల్లో ఎక్కువగా వస్తారు.అయితే వీరికి సకా లంలో స్పందించి చికిత్స అందించాలి. లేదంటే ప్రాణా లకే ప్రమాదం. ఏ మాత్రం నిర్లక్ష్యం వహిం చినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కానీ  కేం ద్రాస్పత్రిలో ముఖ్యంగా రాత్రి వేళల్లో పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది వైద్యులయితే క్లినిక్‌లకు వెళ్లి అక్కడినుంచే ఫోన్లో ట్రీట్‌ మెంట్‌ కింది స్థాయి సిబ్బందికి చెప్పి చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

న్యాయమూర్తి ఆగ్రహం
మంగళవారం రాత్రి జరిగిన సంఘటనపై జిల్లా న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. కేంద్రాస్పత్రి అధికారులను కోర్టుకు పిలిపించినట్టు సమాచారం. ఒక న్యాయమూర్తి పట్లే నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే  సామాన్యుల పరిస్థితి ఏంటని వారిపై మండిపడినట్టు తెలిసింది. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని మందలించినట్టు సమాచారం.
దీనిపై జిల్లా కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్‌ కె.సీతారామరాజు సాక్షితో మాట్లాడుతూ   మహిళ న్యాయమూర్తి వచ్చినప్పుడు వైద్య సిబ్బంది పట్టించుకోలేదని సమాచారం వచ్చింది. న్యాయమూర్తి అనే కాకుండా సామాన్య రోగులకు కూడ సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాలని పదేపదే వైద్య సిబ్బందికి చెబుతున్నా... వారిలో మార్పు రావడం లేదని తెలిపారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు