శిఖరాగ్రాన చిన్నారి

29 Oct, 2017 03:09 IST|Sakshi

పర్వతారోహణలో చిన్నారి కామ్య కార్తికేయన్‌ అద్భుతాలు

పదేళ్ల ప్రాయంలోనే అనేక రికార్డులు   

మూడేళ్ల వయసు నుంచే ట్రెక్కింగ్‌

పిన్న వయసులోనే కిలిమంజారోను అధిరోహించిన రెండో భారతీయ బాలికగా రికార్డు

విశాఖ సిటీ: నడక నేర్చుకున్నప్పటి నుంచే కొండలెక్కడం అలవాటు చేసుకుంది. మూడేళ్లకే ట్రెక్కింగ్‌.. తొమ్మిదేళ్లకే ఎవరెస్టు.. పదేళ్లకే కిలిమంజారో శిఖరాన్ని అలవోకగా అధిరోహించి రికార్డులను ఒడిసి పట్టుకుంది. సంకల్ప బలం ముందు శిఖరాలు సైతం చిన్నబోతాయని నిరూపిస్తోంది.. ఏడు ఖండాల్లోని ఎత్తయిన శిఖరాల్ని అధిరోహించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది విశాఖ నగరానికి చెందిన పదేళ్ల చిన్నారి కామ్య కార్తికేయన్‌. తల్లిదండ్రులే గురువులుగా పర్వతారోహణలో అంతర్జాతీయ ప్రతిభ కనబరుస్తోంది. కామ్య కార్తికేయన్‌ తండ్రి కార్తికేయన్‌ తూర్పు నౌకాదళంలో కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. స్పోర్ట్స్‌ పర్సన్‌గా నేవీలో పలు ప్రశంసలు అందుకున్నారు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది చిన్నారి కామ్య. బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలోనే తల్లిదండ్రులతోపాటు ట్రెక్కింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. ఆ అలవాటే ఆ బాలికకు రికార్డులు తెచ్చిపెడుతున్నాయి.

మూడేళ్ల ప్రాయంలోనే..
క్రమంగా నడక, ట్రెక్కింగ్‌ అలవర్చుకున్న కామ్య మూడేళ్ల ప్రాయంలో ముంబై సమీపంలోని లొనోవాలా ప్రాంతంలో జరిగిన ట్రెక్కింగ్‌లో తండ్రితో పాటు పాల్గొని అందరినీ అబ్బురపరిచింది. అంతేకాదు..
►సహ్యాద్రి పర్వత శ్రేణులతో పాటు జమ్మూకాశ్మీర్లోని గుల్మార్గ్‌ దర్శనీయ స్థలానికి నడుచుకుంటూ వెళ్లింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు.
►మహారాష్ట్రలోని డ్యూక్స్‌ నోస్, రాజ్‌గఢ్‌ పర్వతాల్ని నాలుగేళ్ల వయసులో అవలీలగా తల్లిదండ్రులతోపాటు ఎక్కి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
►ఏడేళ్ల ప్రాయంలో హిమాలయాల ట్రెక్కింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది. మొదటి ప్రయత్నంలో 2015 మేలో 12 వేల అడుగుల ఎత్తయిన చంద్రశీల పర్వతారోహణ చేసింది.
► ఆ తర్వాత 2016లో హిమాలయా పర్వత శ్రేణుల్లో ఒకటైన 13,500 అడుగుల ఎత్తయిన హర్‌కిదున్‌ని విజయవంతంగా పూర్తిచేసింది. కొద్ది రోజుల్లోనే 13,500 అడుగుల ఎత్తయిన కేదార్‌కంఠ పర్వతారోహణ చేసి ఔరా అనిపించింది.
►9 ఏళ్ల వయసులో హిమాలయాల్లో దాదాపు 5,029 మీటర్ల ఎత్తులో ఉన్న రూప్‌కుండ్‌ మంచు సరస్సును అధిరోహించి రికార్డు సృష్టించింది. దీన్ని అధిరోహించడం ద్వారా ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ (ఈబీసీ)కు కామ్య అర్హత సాధించింది.

ఏడాదిలో మూడు రికార్డులు
కామ్య కార్తికేయన్‌ ఈ ఏడాది మూడు రికార్డులు సృష్టించింది. 6 వేల మీటర్లు, 20 వేల అడుగుల ఎత్తయిన పర్వతాల్ని అధిరోహించిన ప్రపంచంలో అతిపిన్న వయసు బాలికగా కామ్య కార్తికేయన్‌ రికార్డు పుటల్లో స్థానం సంపాదించుకుంది. ఈ ఏడాది మే 16న రోజుకు 9 గంటల పాటు నడుస్తూ 9 రోజుల్లోనే 18 వేల అడుగుల ఎత్తయిన నేపాల్‌లోని ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను పూర్తిచేసి ఈ ఘనత సాధించిన అతి చిన్న వయసున్న భారతీయ బాలికగా రికార్డు సొంతం చేసుకుంది. తాజాగా ఈ నెల 25న ఆఫ్రికా ఖండంలో 19,340 అడుగులతో అతి ఎత్తయిన పర్వతమైన కిలిమంజారోని అధిరోహించి శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. తల్లి లావణ్య కార్తికేయన్‌తో పాటు వివిధ దేశాల బృందంతో కలిసి ఈ ఫీట్‌ సాధించిన కామ్య.. పిన్న వయసులోనే కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన రెండో భారతీయ బాలికగా రికార్డు సృష్టించింది. జమ్మూకాశ్మీర్‌లోని లేహ్‌ స్టాక్‌ కాంగ్రీ పర్వతారోహణల్ని విజయవంతంగా పూర్తిచేసిన కామ్య వయసు పదేళ్ల రెండున్నర నెలలు మాత్రమే.

చదువులోనూ శిఖరమే..
విశాఖ నేవీ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్న కామ్య పర్వతారోహణలోనే కాదు.. చదువులోనూ ప్రతిభ కనబరుస్తోంది. ఐదో తరగతి చదువుతున్న  ఆ బాలిక స్పెల్‌బీ కాంపిటేషన్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించింది. వివిధ ఒలింపియాడ్‌లలో జిల్లా స్థాయి మెడల్స్‌ సాధించింది. సంగీతంలోనూ ప్రావీణ్యం పొంది పియానో వాయిద్యంలో 3 గ్రేడులు పాసైంది. కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం సాధించిన ఈ చిన్నారి భరతనాట్యంలోనూ అదరగొడుతోంది.

ఏడు ఖండాల్లో త్రివర్ణ రెపరెపలే లక్ష్యం
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ప్రతి అడుగు ముందుకేస్తున్నాను. అమ్మ లావణ్య ఎప్పుడూ నా వెన్నంటే ఉంటోంది. అందుకే అటు చదువులోనూ, ఇటు పర్వతారోహణలోనూ అపజయం లేకుండా ముందుకెళ్లగలుగుతున్నాను. ఏడు ఖండాల్లో ఉన్న అతిఎత్తయిన శిఖరాల్ని అధిరోహించి భారతీయ జెండాను రెపరెపలాడించడమే నా లక్ష్యం.
– కామ్య కార్తికేయన్‌

మరిన్ని వార్తలు