పంథా మార్చిన పసుపు చొక్కాలు

7 Jul, 2014 02:22 IST|Sakshi
పంథా మార్చిన పసుపు చొక్కాలు

సాక్షి, నెల్లూరు: ఏగడ్డి కరిచైనా సరే జెడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో పసుపు చొక్కాలు పంథా మార్చాయి. నిన్న మొన్నటి వరకూ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులను ప్రలోభ పెట్టి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు వారి కుటుంబ సభ్యులపై ఒత్తిడి పెంచుతున్నారు. తమకు మద్దతిస్తే కోటి రూపాయలు  ఇస్తామంటూ ప్రలోభాల పర్వానికి తెరలేపారు.
 
 అవసరమైతే ఇంకా మరింత మొత్తం ఇస్తామంటూ ప్రలోభపెడుతున్నారు. జెడ్పీటీసీ సభ్యుడిగా ఉంటే ఏమొస్తుంది.. డబ్బులు తీసుకుంటే  మీదశ తిరుగుతుందంటూ ఆశచూపుతున్నారు. ఒక్క డబ్బుల వ్యవహారమే కాక బెదిరింపులకూ దిగుతున్నారు. ఐదేళ్లు అధికారం మాదే, మేం చెప్పిందే వేదం..సరేనంటే ఏ ఇబ్బందీ ఉండదు, కాదంటే ఇబ్బందులు తప్పవనే బెదిరింపులతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. జెడ్పీటీసీ సభ్యుల బంధువులతో పాటు స్నేహితులనూ వదలడంలేదు. అందరితోనూ వత్తిడి చేయిస్తున్నారు. జెడ్పీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడం, వారం రోజులపాటు గడువు ఉండడంతో టీడీపీ నేతలు ప్రలోభాల పర్వాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఎలాగైనా సరే ఇద్దరు సభ్యులను తమవైపు తిప్పుకొనేందుకు నానాతంటాలు పడుతున్నారు.
 
  వైఎస్సార్‌సీపీ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులపై ఆదివారం నుంచి తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు పోలీసు అధికారులతోనూ ఒత్తిడి చేయిస్తున్నట్లు సమాచారం. కావలి నియోజకవర్గంలో ఈ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతల తీరును జిల్లా ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మెజార్టీ లేకపోయినా శనివారం జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో ఆ పార్టీ ప్రతినిధులు వ్యవహరించిన తీరును చూసిన ప్రజలు పసుపు చొక్కాల నేతల తీరును ఎండగడుతున్నారు. ప్రజాతీర్పును అపహాస్యం చేయడంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్‌నే దుర్బాషలాడడాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అయినా సరే నవ్విపోదురు గాక మాకేటిసిగ్గు అన్న సామెతగా అధికార పార్టీనేతలు వ్యవహరించడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మరిన్ని వార్తలు