తుపాకీ మిస్‌ఫైర్‌పై విచారణ

29 Apr, 2015 01:53 IST|Sakshi

విజయవాడ సిటీ : నగర సాయుధ విభాగంలోని బెల్లా ఫామ్స్(ఆయుధాగారం)లో తుపాకీ తూటా పేలుడుపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి విధులు ముగించిన తర్వాత ఏఆర్ ఎస్‌ఐ డిపాజిట్ చేసిన 9ఎం.ఎం. పిస్టల్ నుంచి తూటా బయటకు వచ్చిన విషయం తెలి సిందే. కానిస్టేబుల్ కుమారస్వామి సినీ ఫక్కీలో తుపాకీని తిప్పడంతో ఈ ఘటన జరిగింది. విషయం బయటకు పొక్కకుండా చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కొద్దిరోజుల కిందట రాష్ట్రమంత్రి దేవినేని ఉమా ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న గార్డు చేతిలోని 303 రైఫిల్ పేలిన విషయం తెలిసిందే.

వరుస ఘటనలతో ఆగ్రహించిన పోలీసు అధికారులు ఏఆర్ అధికారుల పనితీరుపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్(ఏఆర్) అధికారులను కమిషనరేట్‌కు పిలిచి విచారణ చేశారు. కమిషనరేట్ పరిపాలనా విభాగం డీసీపీ జి.వి.జి.అశోక్‌కుమార్ సంబంధిత అధికారుల నుంచి వివరాలు నమోదు చేసినట్టు తెలిసింది. జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను తయారు చేసే పనిలో అధికారులు ఉన్నారు.   కమిషనరేట్ ఉన్నతాధికారులు ఏఆర్ విభాగం కార్యకలాపాలపై దృష్టి సారించి సంబంధిత అధికారుల విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు   తెలిసింది.
 

మరిన్ని వార్తలు