బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌పై ట్రయల్‌రన్‌!

4 Feb, 2020 05:03 IST|Sakshi
విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌పై రివ్వున దూసుకుపోతున్న వాహనాలు

తీరనున్న బెజవాడ వాసుల ట్రాఫిక్‌ కష్టాలు 

వచ్చే నెలలో కేంద్రమంత్రి గడ్కరీతో ప్రారంభం  

సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ ట్రాఫిక్‌ కష్టాలను గట్టెక్కించే బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌కు ఎట్టకేలకు లైన్‌క్లియర్‌ అయింది. సోమవారం సాయంత్రం నుంచి భారీ వాహనాల రాకపోకలకు వీలుగా ట్రయల్‌రన్‌ నిర్వహించారు. తొలుత కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు, ఇంజినీరింగ్‌ నిపుణులతో కలిసి ఈ ఫ్లైఓవర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ట్రయల్‌రన్‌లో భాగంగా మొదట కొత్త లారీ (ఏపీ–39–టీహెచ్‌ 9786)ని పంపించారు. తర్వాత చెన్నై వైపు వెళ్లే వాహనాలను అనుమతించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ ఈ వంతెన అందుబాటులోకి వస్తే విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ సమస్య చాలావరకు తీరుతుందని చెప్పారు. వచ్చే నెలలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వంతెనను ప్రారంభిస్తారని వెల్లడించారు. పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఈ వంతెనపై ప్రమాదాలకు తావులేకుండా రెండు వైపులా రిఫ్లెక్టెడ్‌ విద్యుత్‌ లైట్లను పూర్తి స్థాయిలో అమర్చాక రాత్రి వేళ కూడా వాహనాలకు అనుమతిస్తామని తెలిపారు. ట్రయల్‌రన్‌ ద్వారా తెలుసుకున్న సమస్యలను సరిచేసి పూర్తి స్థాయిలో ఈ వంతెనపై వాహనాల రాకపోకలను అనుమతిస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు