పాలకొల్లు ఆర్వోబీపై ట్రయల్ రన్

15 Jan, 2015 03:36 IST|Sakshi

 పాలకొల్లు :పాలకొల్లు పట్టణ శివారు నరసాపురం రోడ్డులోని అయ్యప్పస్వామి గుడి సమీపంలో 18 ఏళ్లుగా సాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. నరసాపురం కాలువపై వంతెన, రైల్వే ట్రాక్‌పై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తికాగా, అప్రోచ్‌రోడ్డు పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. దీంతో ఈ ఆర్వోబీపై ట్రయల్న్‌గ్రా వాహనాల ప్రయాణానికి అనుమతిచ్చారు. నరసాపురం, ఆచంట, తూర్పుగోదావరి జిల్లా ప్రాంతాల నుంచి వచ్చే భారీ వాహనాలు పాలకొల్లు పట్టణంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆర్వోబీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అప్రోచ్ రోడ్డుకు మట్టి, గ్రావెల్ పనులు పూర్తికాగా తారురోడ్డు నిర్మాణం చేపట్టాల్సి వుంది. అయితే రోడ్డు కొంతమేరకు దిగబడే అవకాశం వున్నందున ముందుగా ట్రయల్ రన్‌గా వాహనాల రాకపోకలకు అనుమతిచ్చారు. మార్చి నెలాఖరునాటికి రోడ్డు నిర్మాణం పూర్తిచేసి పూర్తి స్థాయిలో భారీ వాహనాల రాకపోకలకు అనుమతిస్తామని ఆర్‌అండ్‌బీ డీఈ అడబాల శ్రీనివాస్ తెలిపారు.
 
 మూడు నెలల్లో పూర్తి: ఎంపీ గంగరాజు
 పాలకొల్లు : పాలకొల్లు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) ప్రారంభోత్సవం మరో మూడు నెలల్లో జరుగుతుందని ఎంపీ గోకరాజు గంగరాజు చెప్పారు. బుధవారం స్థానిక ఆర్వోబీ అప్రోచ్‌రోడ్డు పనులు పరిశీలించిన సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడుతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైల్వే, ఆర్‌అండ్‌బీ అధికారులతో సంప్రదించి పనులు పూర్తి చేసేందుకు కృషి చేశానన్నారు. ఇంకా అప్రోచ్ రోడ్డు పూర్తిస్థాయిలో నిర్మించాల్సి వుందన్నారు. ఇప్పటికే మట్టి, గ్రావెల్ పనులు పూర్తయ్యాయని, దీంతో బుధవారం నుంచి వాహనాల ప్రయాణానికి అనుమతి ఇచ్చినట్టు గంగరాజు తెలిపారు. మార్చి నెలాఖరు నాటికి బీటీ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వడలివానిపాలెం నుంచి ఆచంట బైపాస్‌రోడ్డు మీదుగా ఆర్వోబీకి రింగ్‌రోడ్డు ఏర్పాటు చేయాలని దీనికి ఎంపీ గంగరాజు కృషి చేయాలని కోరారు. సమావేశంలో మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్ చైర్‌పర్సన్ కర్నేన రోజారమణి, ఆర్‌అండ్‌బీ డీఈ అడబాల శ్రీనివాస్, ఏఈ మూర్తి, టీడీపీ నాయకులు అడబాల వెంకటరమణ, గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు, కర్నేన గౌరునాయుడు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు