దైవ దర్శనాలకు ట్రయల్‌ రన్

9 Jun, 2020 03:30 IST|Sakshi
తిరుమల మహాద్వారం నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్తున్న టీటీడీ సిబ్బంది

తిరుమలలో విజయవంతంగా ప్రయోగాత్మక దర్శనాలు 

ఇంద్రకీలాద్రి, రత్నగిరి, శ్రీశైలం, ఒంటిమిట్ట, అరసవిల్లి, 

సింహాద్రి అప్పన్న క్షేత్రాల్లోనూ విజయవంతం 

భౌతిక దూరం పాటిస్తూ.. దర్శనం చేసుకున్న భక్తులు

రేపటి నుంచి సాధారణ భక్తులకు అనుమతి  

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో దర్శనానికి భక్తులను అనుమతించే క్రమంలో సోమవారం నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. ఆలయాల సిబ్బంది, వారి కుటుంబాలకు దర్శనం కల్పించి భౌతిక దూరం పాటిస్తూ గంటకు ఎంతమంది భక్తులను అనుమతించ వచ్చనే విషయాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

తిరుమల/ఇంద్రకీలాద్రి/అన్నవరం/శ్రీశైలం/అర సవిల్లి/సింహాచలం: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో దర్శనానికి భక్తులను అనుమతించే క్రమంలో సోమవారం నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. తిరుమల, అన్నవరంలోని రత్నగిరి, ఒంటిమిట్ట, శ్రీశైలం తదితర ఆలయాల్లో సంబంధిత సిబ్బంది, వారి కుటుంబాలకు దర్శనం కల్పించి భౌతిక దూరం పాటిస్తూ గంటకు ఎంతమంది భక్తులను అనుమతించవచ్చు, క్యూలైన్‌లో ఎలా పంపించాలి, శానిటైజేషన్‌ ప్రక్రియ వంటి వాటిని ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

తిరుమలలో గంటకు 500 మంది..
► తిరుమల శ్రీవారి క్షేత్రంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించి గంటకు 500 మంది భక్తులను  దర్శనానికి అనుమతించవచ్చని అంచనా వేశారు. 
► సోమవారం 6,300 మంది దర్శించుకోగా.. 425 మంది తలనీలాలు సమర్పించారు. 
టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి క్యూ కాంప్లెక్స్‌లో భౌతిక దూరం, భక్తులు హుండీ వద్దకు వెళ్లేప్పుడు, బయటకు వచ్చేప్పుడు నాన్‌ ఆల్కహాల్‌ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునే విధానాన్ని చూశారు.
► దర్శనం ప్రారంభించిన 2 గంటల్లో 1,200 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని సుబ్బారెడ్డి తెలిపారు.
► క్యూలైన్‌లో భక్తులు గ్రిల్స్, గోడలు తాకకుండా అవగాహన కల్పిస్తామని, ప్రాంగణంలోని తాగునీటి కుళాయిలను చేత్తో తాకకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. 
► అన్నదానం కాంప్లెక్స్‌లోనూ ఫుట్‌ ఆపరేటెడ్‌ కుళాయిలు ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. 
► శ్రీవారిని దర్శించుకునే భక్తులకు 10వ తేదీ నుంచి తిరుపతిలోని మూడు ప్రాంతాల్లోని 12 కౌంటర్లలో ప్రతిరోజు 3 వేల ఉచిత దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్టు చెప్పారు.

దుర్గమ్మ దర్శనానికి రేపటి నుంచి అనుమతి
► విజయవాడలోని దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ చెప్పారు.
► ఈ నెల 10వ తేదీ నుంచి దుర్గమ్మ సహా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నట్టు చెప్పారు. 
► గంటకు 250 మంది భక్తులు దుర్గమ్మ వారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. 

రత్నగిరిపై ఏర్పాట్లు
► తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై సత్యదేవుని దర్శనాలు ప్రయోగాత్మకంగా ప్రారంభమయ్యాయి. 
► సోమవారం ప్రయోగాత్మకంగా స్థానికులు, ఆలయ సిబ్బందిని అనుమతించారు. బుధవారం నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తారు. 

శ్రీశైలం, ఒంటిమిట్ట, అరసవిల్లి, సింహాద్రి అప్పన్న క్షేత్రాల్లో..
► శ్రీశైలంలోని మల్లన్న దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం దేవస్థానం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. 
► వైఎస్సార్‌ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో దర్శన ఏర్పాట్లను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. 
► శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలోని ఆదిత్యుని ఆలయంతోపాటు శ్రీకూర్మం, శ్రీముఖ లింగం ఆలయాల్లో ట్రయల్‌ రన్‌ విజయవంతంగా నిర్వహించారు.
► సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, అధికారులు, సిబ్బందితో దర్శనాల ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. బుధవారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. 

కంటైన్‌మెంట్‌ జోన్‌లలో చర్చిలు తెరవొద్దు
నేటి నుంచి అన్ని ప్రార్థన మందిరాలను తెరుస్తున్న నేపథ్యంలో చర్చిల్లో అనుసరించాల్సిన పద్ధతులను, నిబంధనలను క్రిస్టియన్‌ మైనార్టీ కార్పొరేషన్‌ ఎండీ ఎన్‌. ఏసురత్నం సర్క్యులర్‌ జారీ చేశారు. ప్రార్థనలకు వచ్చే భక్తులంతా వీటిని పాటించాలని పేర్కొన్నారు. 65 సంవత్సరాలు నిండిన వారు, 10 సంవత్సరాల్లోపు పిల్లలు ఇంట్లోనే ఉండటం మంచిదన్నారు. 

► కనీసం ఆరు అడుగుల దూరం పాటించడం, మాస్క్‌లు, ముసుగులు ధరించడం తప్పనిసరి. 
► చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. వీలైనంత వరకు ఆల్కహాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్లు వాడాలి. 
► ఉమ్మివేయడాన్ని కచ్చితంగా నిషేధించాలి. 
► ఆరోగ్యసేతు యాప్‌ను తప్పకుండా ఉపయోగించాలి. 
► చర్చిల్లో నిర్వాహకులు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిబంధనలు పాటించాలి. కరోనా లక్షణాలు లేని వ్యక్తులను మాత్రమే అనుమతించాలి. 
► కోవిడ్‌ –19 నివారణ చర్యలపై అవగాహనకు ఆడియో, వీడియో క్లిప్‌లను ప్రసారం చేయాలి. 
► విగ్రహాలు, పవిత్ర గ్రంథాలు, తాకడాన్ని అనుమతించరు. పెద్ద సమావేశాలు నిషేదం. సమూహాలుగా గానాలాపన చేయకూడదు. 
► ప్రసాదం పంపిణీ, పవిత్ర జలం జల్లడం చేయకూడదు. భక్తులు వదిలేసే ఫేస్‌ కవర్లు, చేతి తొడుగులను తొలిగించేందుకు నిర్వాహకులు ఉద్యోగులను నియమించాలి. 
► ప్రార్థన ప్రాంగణంలో అనుమానితులు, వ్యాధితో బాధపడే వారిని ప్రత్యేక గదిలో ఉంచాలి.  

>
మరిన్ని వార్తలు