తిరుమల శ్రీవారి దర్శనానికి 8 నుంచి ట్రయల్‌ రన్‌

3 Jun, 2020 03:45 IST|Sakshi

10 లేదా 11 నుంచి సాధారణ భక్తులను అనుమతించే అవకాశం 

సర్వదర్శనాలకు విధిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి

సాక్షి, అమరావతి/తిరుమల: లాక్‌డౌన్‌ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు నెలలకు పైగా నిలిచిపోయిన భక్తుల దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరిగి పునఃప్రారంభిస్తోంది. మొదట ప్రయోగాత్మక పరిశీలన కింద ట్రయల్‌ రన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతిచ్చింది. టీటీడీ ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వినతి మేరకు రాష్ట్ర దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ అనుమతి తెలియజేస్తూ మంగళవారం మెమో ఉత్తర్వులు జారీచేశారు. భౌతికదూరం పాటిస్తూ శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లుచేయాలని అందులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో మూడ్రోజులపాటు ప్రయోగాత్మకంగా ట్రయల్‌ రన్‌ పద్ధతిలో దర్శనాలను టీటీడీ ప్రారంభించనుంది. ఈ ట్రయల్‌ రన్‌ నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ కూడా సమ్మతి తెలియజేసినట్లు జేఎస్వీ ప్రసాద్‌ ఆ మెమోలో తెలిపారు. అనంతరం 10 లేదా 11 నుంచి సాధారణ భక్తులను అనుమతించే అవకాశముంది. ఈ సందర్భంగా అధికారులు పలు కరోనా నివారణ చర్యలు చేపట్టారు. అవి..

► క్యూలైన్, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులు ఆరు అడుగుల భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
► అన్నప్రసాద కేంద్రం, తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలో కరోనా నివారణ చర్యలు చేపట్టనున్నారు.
► తొలుత రోజుకు 8వేల నుంచి 10వేల మంది భక్తుల వరకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు.
► అనంతరం 20వ తేదీ నుంచి సుమారు 30 వేల మంది భక్తులను అనుమతించే అవకాశం ఉంది. అలాగే, అలిపిరి నుంచి ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి.
► సర్వదర్శనాలకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.
► అలిపిరి, మెట్ల మార్గంలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. 
► పుష్కరిణిలో స్నానాలకు భక్తులకు అనుమతిలేదు. 
► శ్రీవారికి ఏకాంతంగానే సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తారు. 

మిగిలిన ఆలయాలపైనా సమీక్ష
ఇదిలా ఉంటే.. దేవదాయ శాఖ ఆధీనంలోని అన్ని ఆలయాల్లోనూ భక్తులకు తిరిగి దర్శనాలు ప్రారంభించడంపైనా ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం వైఎస్‌ జగన్‌తో చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. 

అలిపిరిలో థర్మల్‌ స్క్రీనింగ్‌ తర్వాతే అనుమతి : వైవీ సుబ్బారెడ్డి
తిరుపతి అలిపిరి వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ తర్వాతే భక్తులను తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసులో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి కూడా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. వీరికి అలిపిరి వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేస్తామని చెప్పారు. 

>
మరిన్ని వార్తలు