ఎన్నికల ‘ట్రయల్’

13 Feb, 2014 23:21 IST|Sakshi

సింగూరు నుంచి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘సింగూరు’ మళ్లీ ఎన్నికల ప్రాజెక్టుగానే మిగిలింది. ప్రధాన కాల్వ నిర్మాణం పూర్తికాకుండానే హడావుడిగా ట్రయల్న్ నిర్వహించడం, ట్రయల్న్ నీటిపై ఆధారపడి  పంటలు వేసుకోవద్దని సింగూర్ ప్రాజెక్టు ఇరిగేషన్ డీఈ జగన్నాథం ప్రకటించడం రైతులను విస్మయానికి గురిచేసింది. సింగూరు తూ ము నుంచి 0.15 టీఎంసీల ( 768.66 క్యూసెక్యులు) నీరు దిగువకు వదిలేందుకు ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ నీళ్ల ద్వారా ముందు గా అందోల్ పెద్ద చెరువును నింపుతామనీ, ఆ తర్వాత పుల్‌కల్ మండలంలోని 5 చెరువులు, అందోల్ మండలంలో మరో 2 చెరువులు నింపుతామని అధికారులు చెబుతున్నారు. నిజంగా ఈ నీరంతా నేరుగా పంట పొలాల్లోకి వెళ్తే సుమారు 7.5 వేల ఎ కరాలకు నీరు పారాలి కానీ, ప్రస్తుతం సెంటు భూమికి కూడ నీ రు అందే పరిస్థితి లేదని ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు.

 అధికారుల్లో ఆందోళన...
 సింగూరు తూము నుంచి ఆందోల్ చెరువు వరకు 24 కిలోమీటర్లు ఉంటుంది. ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ రికార్డుల ప్రకారం కేవలం 22 కిలో మీటర్లు మాత్రమే కాల్వ పూర్తి చేశారు. అది కూడా అసంపూర్తిగానే తవ్వి వదిలేశారు. దీంతో ట్రయల్ రన్ కింద వదిలిన నీరు ఆందోల్ చెరువులకు చేరుతుందో లేదో అని అధికారులు అందోళన చెందుతున్నారు. కుడి ఎడమ కాల్వలు కలిపి 60 కిలో మీటర్లు మెయిన్ కెనాల్ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు పూర్తి అయింది కేవలం 42 కిలో మీటర్లు మాత్రమే.  ఎక్కడ కూడా పిల్ల కాల్వల నిర్మాణం పూర్తి కాలేదు. మెయిన్ కాల్వకు ఏ ఒక్క చోట కూడా పిల్ల కాల్వలు కలపలేదు. ఇవేమీ లేకుండానే ట్రయల్ ర న్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 వైఎస్సార్ చేసిన పనులే....
 2005లో వైఎస్సార్ సింగూర్ ఎత్తిపోతల పథకానికి రూ 89.98 కోట్లు మంజూరు చేస్తూ 139 జీవోను విడుదల చేశారు. ఎత్తిపోతల ద్వారా కుడి కాల్వ కింద సదాశివపేట, మునిపల్లి, సంగారెడ్డి మండలాల్లో 2500 ఎకరాలకు, ఎడమ కాల్వ ద్వారా ఆందోల్, పుల్‌కల్, అల్లాదుర్గం,  రేగోడ్ మండలాల్లో 37,500 ఎకరాలకు  కలిపి మొత్తం 40 వేల ఎకరాల్లో సాగునీరు అందించాలని సంకల్పించారు. మొదటి విడత కింద రూ. 35 కోట్లు వైఎస్సార్ విడుదల చేశారు. ఆయన హయాంలోనే దాదాపు 60 శాతం పనులు పూర్తి అయ్యాయి.

వైఎస్సార్ మరణం తర్వాత మూడేళ్ల వరకు  ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. దామోదర రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టుబట్టి 2013 బడ్జెట్‌లో సింగూరు ప్రాజెక్టుకు రూ.40 కోట్లు కేటాయించేలా చూశారు. ఎందుకోగాని వాటిని ఖర్చు చేయలేదు. తిరిగి అవే నిధులను 2014 బడ్జెట్‌లో కేటాయించారు. ఆ నిధులతో వైఎస్సార్ చేసిన పనులకే పైపై మెరుగులు దిద్ది ‘మమ’ అనిపించారు.  ప్రస్తుతం ఎడమ కాల్వ వద్ద లిఫ్టు పనులు చేస్తున్నారు. ఈ పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి.  ఇవన్నీ పూర్తైసింగూరు నీళ్లు  వైఎస్సార్ కలలుగన్నట్టు సంపూర్ణంగా  రైతుల పంట పొలాల్లోకి వెళ్లాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు