అ‘డ్రస్’ లేదాయే!

16 Jul, 2014 23:57 IST|Sakshi
అ‘డ్రస్’ లేదాయే!

 రంపచోడవరం : ఏటా గిరిజన విద్యకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా, గిరిజన బాలలపై నిర్లక్ష్యం తప్పడం లేదు. పక్కాగా వారికి కల్పించాల్సిన సౌకర్యాలను అంతంతమాత్రంగా కల్పిస్తున్నారు. ఏటా ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో గిరిజన విద్యార్థులకు పాఠశాల ప్రారంభంలోనే దుస్తులు అందించాల్సి ఉండగా, పాఠశాలలు తెరిచి నెల రోజులైనా నేటికీ అందించలేదు.  
 
 గత ఏడాదీ ఇవ్వలేదు
 ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు 59, వసతి గృహలు 22 ఉన్నాయి. వీటిలో దాదాపు 14 వేల మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. ఏటా వీరికి నాలుగు జతల దుస్తులు అందజేయాలి. దీనికిగాను ఆప్కో నుంచి క్లాత్ సరఫరా చేస్తారు. 2011-12 విద్య సంవత్సరంలో 20,084.50 మీటర్ల క్లాత్ ఉండగా, 2013-14 విద్య సంవత్సరానికి 1718.57 మీటర్ల క్లాత్ ఇండెంట్ పెట్టారు. 2014-15 విద్య సంవత్సరంలో 1,29,194 మీటర్ల క్లాత్ ఇండెంట్ పెట్టారు. అయితే 2013-14 విద్య సంవత్సరంలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదు. దీంతో చొక్కాలకు క్లాత్ ఉంటే, ఫ్యాంట్లకు క్లాత్‌లు లేని పరిస్థితి నెలకొంది. అయితే 2013-14 విద్య సంవత్సరంలో కొత్తగా ఆశ్రమ పాఠశాలలో చేరిన విద్యార్థులకు దుస్తులు సరఫరా చేయలేదు. రంపచోడవరం మండలంలోని ఒక ఆశ్రమ పాఠశాలలో గత ఏడాది ఐదో తరగతిలో చేరిన విద్యార్థులకు విద్య సంవత్సరం ముగిసినా కనీసం ఒక జత దుస్తులు కూడా అందలేదు.
 
 దీంతో గిరిజన విద్యార్థులపై ఎంత నిర్లక్ష్యం చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే వీరు 2014-15 విద్య సంవత్సరంలోకి వచ్చినా నేటికీ ఒక జత దుస్తులు కూడా ఇవ్వలేక పోయారు. విద్యార్థుల దుస్తుల కోసం క్లాత్‌ను నేరుగా పాఠశాలలకు పంపితే దుర్వినియోగమవుతుందనే ఉద్దేశంతో ఐటీడీఏ రంపచోడవరంలోని ఫ్యాషన్ టెక్నాలజీ సెంటర్‌లో కుట్టించి పాఠశాలలకు సరఫరా చేసేది. అయితే ఈ ఏడాది మళ్లీ తిరిగి క్లాత్‌ను నేరుగా పాఠశాలలకు పంపి, సంబంధిత హెచ్‌ఎంలు దుస్తులు కుట్టించి విద్యార్థులకు అందించాలని గిరిజన సంక్షేమ విద్య విభాగం వారు తెలిపారు. అయితే మారుమూల ప్రాంతాల్లోని టైలర్ల సమస్య ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు దుస్తులు కుట్టించి, పాఠశాల ప్రారంభం నాటికి కనీసం రెండు జతలు అందిస్తే బాగుంటుంది. కానీ ఐటీడీఏ పట్టించుకోవడం లేదు.
 
 దుస్తులు ఇవ్వడానికి చర్యలు
 గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణికుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది పూర్తి స్థాయిలో విద్యార్థులకు దుస్తులు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే క్లాత్‌ను పాఠశాలలకు అందించాం.
 

మరిన్ని వార్తలు