గిరి రైతులకు మొండిచెయ్యి!

2 Jan, 2015 03:52 IST|Sakshi
గిరి రైతులకు మొండిచెయ్యి!

సీతంపేట:రుణమాఫీ.. ఈ మాట వింటే గిరిజన రైతులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తామని హామీలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత లేనిపోని ఆంక్షలతో రైతుల సహనాన్ని పరీక్షిస్తుండడమే దీనికి కారణం. చాలామంది రైతులకు అసలు రుణమాఫీయే వర్తించలేదు. ఇదే కోవకు చెందుతారు ఉద్యానవన పంటలను సాగుచేసే గిరిజన రైతులు. రుణమాఫీ విషయంలో వీరికి టీడీపీ సర్కార్ మొండిచెయ్యి చూపించడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. మొదటి విడత జాబితాలో వీరి పేర్లు లేకపోవడంతో రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నారు. తీరా ఈ జాబితాలో కూడా పేర్లు లేకపోవడంతో నిరాశతో కుంగిపోతున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గిరిజనులు ఉద్యానవన పంటలను సాగు చేసుకొని బతుకు బండిని ఈడుస్తున్నారు.
 
 ఒక్క సీతంపేట మండలంలోనే సుమారు పది వేల మంది గిరిజన రైతులు ఉన్నారు. వీరంతా కొండపోడు పంటలైన జీడిమామిడి, పసుపు, అల్లం, కంది, అరటి తదితర పంటలు పండిస్తారు. వీరిలో వివిధ పంటల రుణాల కింద సుమారు 5,600 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. కేవలం ఖరీఫ్ వరిపై రుణాలు తీసుకున్నట్టుగా జాబితాలో ఉన్న 445 మందికి మాత్రమే రుణాలు మాఫీ అయ్యూరుు. వీటికి కూడా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు గిరిజన రైతులు వాపోతున్నారు.  స్థానిక ఆంధ్రాబ్యాంకులో దాదాపు 1400, ఎస్‌వీజీబీలో 1200, కుశిమి ఇండియన్ బ్యాంకులో రెండు వేలకు పైగా రైతులు రుణాలు తీసుకున్నారు. కుశిమి ఇండియన్ బ్యాంకు ద్వారా అయితే ఎవ్వరికీ రుణమాఫీ కాకపోవడం గమనార్హం.
 
 8 పంచాయతీల్లో ఒక్కరికీ రుణమాఫీ లేదు...
 సీతంపేట ఏజెన్సీలో 8 పంచాయతీలున్నాయి. వీటిలో కనీసం ఒక్కరికీ  రుణమాఫీ కాలేదు. శంభాం, కోడిశ, కుడ్డపల్లి, కొండాడ, టిటుకుపాయి, మండ, కిల్లాడ, పెదపొల్లలలో ఒక్కరైతుకూ రుణమాఫీ వర్తించలేదు. సామరెల్లి, పుబ్బాడలలో అయితే పంచాయతీకి ఇద్దరికి చొప్పున రుణమాఫీ అరుుంది. ఏజెన్సీలో రుణం తీసుకున్నవారంతా చిన్నరైతులే. ఒక్కో గిరిజన రైతు కేవలం రూ.30 వేలు లోపే రుణాన్ని తీసుకున్నారు. అయితే ఇంత తక్కువ మొత్తాల్లో రుణాలు తీసుకున్నా మాఫీ కాకపోవడంపై గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2007లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో ఉద్యానవన పంటలకు సైతం రుణమాఫీ జరిగిందని, ఇప్పుడు అసలు మాఫీ జరగకపోవడమేమిటని వీరంతా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయూన్ని మండల వ్యవసాయాధికారి జ్ఞానేంద్రమణి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా కేవలం వరి పంటకు మాత్రమే రుణమాఫీ వచ్చిందని, ఉద్యానవన పంటలకు రాలేదని స్పష్టం చేశారు.
 
 పోడు పట్టాలపై ఇచ్చిన రుణాలకు మాఫీ చేయాలి
 కొండపోడు పట్టాలకు రుణమాఫీ తప్పనిసరిగా చేయాలి. లేకపోతే గిరిజన రైతులు ఇబ్బంది పడతారు. రుణమాఫీ జరుగుతుందని ఎంతో ఆశతో ఉన్నారు. వడ్డీలు చాలా పెరిగిపోయి రుణాలు తడిపిమోపెడయ్యాయి. వీటిపై ప్రభుత్వం స్పందించాలి.                                
 - సవరగోపాల్, సర్పంచ్, సోమగండి
 ఆశ నిరాశ చేశారు
 నేను ఐదేళ్ల క్రితం బ్యాంకు నుంచి రూ.8 వేలు తీసుకున్నాను. అయితే వడ్డీతో పదివేలు దాటిపోయింది. రుణమాఫీ అంటే అందరికీ చేస్తారనుకున్నాం. గిరిజన రైతులకు అన్యాయం చేశారు. మేమంతా కేవలం కొండపోడుపైనే ఆధార పడి జీవిస్తారనేది ప్రభుత్వం గమనించాలి.     
 - సవర తిక్కమై, గిరిజన మహిళ
 

మరిన్ని వార్తలు