నీళ్లు పోశామంటూ కోట్లు నొక్కేశారు

19 Nov, 2014 00:40 IST|Sakshi
నీళ్లు పోశామంటూ కోట్లు నొక్కేశారు

 కంచే చేను మేసిందన్న సామెతను మన్యంలో ఉపాధి హామీ పథకం అధికారులు నిజం చేశారు. గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, మొక్కల పెంపకానికి ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఎంచక్కా నొక్కేశారు. ఇందుకోసం అన్ని స్థాయిల ఉద్యోగులూ కుమ్మక్కయ్యారు. పక్కాగా రికార్డులు చూపించారు. కోట్లు దిగమింగేశారు. ఏడు నెలల కాలంలో జరిగిన ఈ అవకతవకల విలువ ఐదారు కోట్లు పైనే ఉంటుందని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ పరిశీలనలో పలు ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ :గిరి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గత ఏడాది ఉపాధి హామీ పథకంలో జీడిమామిడి తోటల పెంపకం చేపట్టింది. దీనికింద రంపచోడవరం డివిజన్‌లో మొక్కల పెంపకం, పోషణ కోసం 2013 ఏప్రిల్ నుంచి గత అక్టోబర్ వరకూ రూ.18.16 కోట్లు విడుదల చేసింది. ఏజెన్సీలోని 11,302 మంది రైతులకు చెందిన 16,883 ఎకరాల్లో ఈ పథకం కింద జీడిమామిడి మొక్కలు నాటారు. వీటికి నీరు పోసేందుకు ఎకరానికి రూ.10 వేలు చొప్పున నిధులు వచ్చాయి. పంపిణీ చేసిన మొక్కల పెంపకానికి ప్రతి నెలా రైతుల బ్యాంక్ ఖాతాల్లో మూడేళ్లపాటు సొమ్ము జమ చేయాలి. ఎకరానికి 70 మొక్కలు ఇచ్చారు. వాటిలో 40 మొక్కలు బతికితే కనుక నాటడం, గోతులు తియ్యడం, చుట్టూ గూడు కట్టడంవంటి పనుల కోసం నెలకు రూ.1050 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయాలి. అలాగే మొక్కలకు నీరు పోసేందుకు జనవరి నుంచి జూన్ వరకూ ఆరు నెలల కాలానికి ఎకరాకు రూ.6వేలు ఇవ్వాలి. ఇందుకోసం రూ.10.12 కోట్లు వచ్చాయి. ఈ నిధులు నొక్కేసేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఓలు కుమ్మక్కయ్యారు.
 
 గత ఏడాది ఇచ్చిన మొక్కలకు నీరు పోయకుండానే పోసినట్టుగా పక్కా రికార్డులు తయారుచేసి విడుదలైన నిధుల్లో అందిన కాడికి దిగమింగేశారు. నీరు పోయని జీడిమామిడి తోటలకు సైతం గిరిజనులతో అవసరమైనచోటల్లా సంతకాలు పెట్టించుకొని సొమ్ములు నొక్కేశారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నుంచి విడుదలయ్యే నిధులను మొదట రైతుల ఖాతాలో జమ చేశారు. ఆనక ఆ సొమ్ములు డ్రా చేసి ‘మీకింత-మాకింత’ అనే ముందస్తు ఒప్పందం మేరకు పంపకాలు జరిపించేశారు. ఎకరం తోటకు ఉపాధి సిబ్బందికి రూ.4వేలు, రైతులకు రూ.2వేలు చొప్పున పంపకాలు చేపట్టారు. కొన్నిచోట్ల రెండెకరాల తోట ఉన్న రైతులతో జరిగిన ఒప్పందం ప్రకారం యంత్రాంగానికి రూ.6వేలు, రైతుకు రూ.6వేలుగా పంచేసుకున్నారు.  మొత్తంగా లెక్కేస్తే అన్ని స్థాయిల సిబ్బంది కలిపి దాదాపు రూ.5 కోట్లు పైగానే భోంచేశారు.
 
 వై.రామవరం మండలం చామగెడ్డ పంచాయతీలో 200 ఎకరాల్లో జీడిమామిడి మొక్కలు నాటారు. వీటికి నీరు పోసేందుకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.20 లక్షలు మంజూరయ్యాయి. ఇక్కడ 100 ఎకరాల్లో కూడా నీరు పోయలేదని చెబుతున్నారు. మిగిలిన 100 ఎకరాలకు సంబంధించి విడుదలైన రూ.10 లక్షల్లో ఉపాధి అధికారులు, సిబ్బంది రూ.6 లక్షలు దిగమింగి, మిగిలిన రూ.4 లక్షలు రైతులు, బ్రోకర్లకు ముట్టజెప్పారని స్థానికులు ఆరోపిస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్ నుంచి ఏపీఓ, ఏపీడీ వరకూ కుమ్మక్కై ఒక్కో రైతు నుంచి ఆరేడు వేల వంతున నొక్కేశారు. చామగడ్డ, బండిగెడ్డ గ్రామాల్లో రైతుల నుంచి ఒక క్షేత్రస్థాయి ఉద్యోగి రూ.5 లక్షలు జేబులో వేసుకున్నాడు.
 
     అడ్డతీగల మండలం ఎల్లవరం, రంపచోడవరం మండలం రంప గ్రామాలను పరిశీలిస్తే.. ఒక్కో గ్రామంలో 10 మంది లబ్ధిదారులున్నారు. తమలో ఒక్కరికి కూడా సొమ్ములు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డు కోసం అన్నట్టుగా కొందరి ఖాతాల్లో సొమ్ము వేసి చేతులు దులిపేసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన సొమ్ములో యంత్రాంగం చేతివాటం చూపించింది.
  పెదగెద్దాడలో 66 మంది రైతులకు 74 ఎకరాల్లో 5,180 జీడిమామిడి మొక్కలు ఇచ్చారు. వీటికి నీరు పోసేందుకు చిల్లిగవ్వ కూడా అందలేదని ఆయా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 ఒకటి, అరా గ్రామాల్లో జరిగిన అన్యాయాన్ని నాయకుల దృష్టికి తీసుకువెళ్లగా, వారికి డబ్బులు తిరిగి ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఏపీఓ స్థాయిలో ఐదుగురు కీలకపాత్ర పోషించారని తెలియవచ్చింది. ఇదే విషయాన్ని వారు అంగీకరించి, రైతులకు తిరిగి సొమ్ములు ఇచ్చేశారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఉపాధి హామీ నుంచి విడుదలయ్యే సొమ్ము కొన్ని పంచాయతీల్లో విలేజ్ ఆర్గనైజేషన్, కొన్ని గ్రామాల్లో రైతుల ఖాతాలకే జమ అయ్యేవి. ఆర్గనైజేషన్‌లో ఉన్న డ్వాక్రా గ్రూపు మహిళా ప్రతినిధుల చేతికి ఆ సొమ్మంతా చేరేది. అలా వారు డ్రా చేసి రైతులందరికీ అందజేసే పరిస్థితులను చాకచక్యంగా వినియోగించుకుని పెద్ద మొత్తంలో సొమ్ములు కాజేశారు. నిబంధనల ప్రకారం నీరు పోసి ఉంటే ఏ ప్రతి నెలా సొమ్ము విడుదల చేయాలి. రైతులు ఎప్పటికప్పుడు కూలీలకు సొమ్ములివ్వాలి. ఇవ్వకపోతే రెండో రోజే వారు పనిలోకి రారు. ఫండ్ ట్రాన్‌‌సఫర్ ఆర్డర్(ఎఫ్‌టఓ)లో ఏ రైతుకు ఎంత అనే వివరాలుంటాయి. దాని ప్రకారం పే స్లిప్పులు ఇచ్చి, వాటి ద్వారానే సొమ్ము అందజేసే క్రమంలోనే ఈ అవినీతికి పాల్పడ్డారని చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు