కొండరెడ్డి గిరిజన విద్యార్థిని మృతి

9 Nov, 2018 06:53 IST|Sakshi
మృతదేహాన్ని వాహనంలో ఇంటికి తరలిస్తున్న దృశ్యం

చికిత్స పొందుతూ కన్నుమూత

మన్యంలో విజృంభిస్తున్న జ్వరాలు

పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల ప్రాంతమైన రెడ్డికోపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న పాములేటి సీతమ్మ (10) అనే కొండరెడ్డి గిరిజన విద్యార్థిని గురువారం వైద్యం పొందుతూ విజయవాడలో మృతి చెందింది. గత నెల 30న జ్వరంతో బాధపడుతున్న సీతమ్మను పులిరామన్నగూడెం ఆస్పత్రిలో చేర్పించినట్టు డాక్టర్‌ సురేష్‌ తెలిపారు. అయితే ఆ సమయంలో రక్తపరీక్షలు చేయగా మలేరియా జ్వరంగా నమోదైందని చెప్పారు. మూడు రోజులపాటు మెరుగైన వైద్యం అందించామన్నారు. ఈనేపథ్యంలో ఈనెల 1వ తేదీ రాత్రి సీతమ్మకు వాంతులు కావడంతోపాటు కాళ్లు, చేతులు బిగుసుకుపోవడంతో పాఠశాల సిబ్బంది మళ్లీ పీహెచ్‌సీకి తీసుకువచ్చారన్నారు. ప్రాథమిక వైద్యం చేసి జంగారెడ్డిగూడెం రిఫర్‌ చేశామని అక్కడి నుంచి ఏలూరు, విజయవాడకు తరలించగా అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందినట్టు డాక్టర్‌ సురేష్‌ చెప్పారు.

పాఠశాలలో రెండో మరణం
రెడ్డికోపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఇప్పటికే ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. గతంలో కెచ్చెల పద్మ అనే విద్యార్థిని మృతి చెందగా ఇప్పుడు సీతమ్మ కన్నుమూసింది. అనా రోగ్యంతో ఉన్న సీతమ్మను పులిరామన్నగూడెం ఆస్పత్రిలో చేర్పించినప్పుడు మలేరియా కేస్‌గా నమోదైంది. అయితే విజయవాడలో వచ్చిన రిపోర్ట్‌లో మాత్రం క్లబిసెలా బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వల్ల మృతి చెందినట్టు ఉంది. అయితే ఎక్కడా మలేరియా ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

చదువుకోవడానికి వచ్చి మృత్యుఒడికి..
పశ్చిమ ఏజెన్సీలో మారుమూల చిలకలూరు గ్రామానికి చెందిన పాములేటి సీతమ్మ చదువు కోసం రెడ్డికోపల్లి గురుకుల పాఠశాలలో చేరింది. గతనెలలో దసరా సెలవులకు ఇంటికి వెళ్లి పాఠశాల పునఃప్రారంభం తర్వాత వచ్చిన సీతమ్మ జ్వరం బారినపడింది. పది రోజులపాటు వైద్యం పొందినా ప్రయోజనం లేకపోయింది. ఐటీడీఏ పీఓ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌ సీతమ్మను బతి కించేందుకు సుమారు రూ.2 లక్షల వరకూ ఖర్చు చేసినట్టు సిబ్బంది చెబుతున్నారు. అయినా సీతమ్మ మృత్యు ఒడికి చేరింది. మృతురాలు సీతమ్మ తల్లి రామమ్మ ఐదేళ్ల క్రితం జ్వరంతోనే మృతిచెందింది.  తండ్రి చిన్నారెడ్డి అడవే ఆధారంగా జీవించే సాధారణ కూలీ. సీతమ్మకు అక్క, తమ్ముడు ఉన్నారు.

మరిన్ని వార్తలు