గర్భం దాల్చిన ఆశ్రమ పాఠశాల బాలిక

24 Dec, 2019 03:58 IST|Sakshi

విశాఖ ఏజెన్సీ నుర్మతి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో ఘటన

మహిళా కమిషన్‌ సభ్యురాలి విచారణ

జి.మాడుగుల (పాడేరు): ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో చదువుతున్న మైనార్టీ తెగకు చెందిన బాలిక గర్భం దాల్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం నుర్మతి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బీసీ (మైనార్టీ) విద్యార్థిని గర్భం దాల్చినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. నుర్మతిలో పాఠశాల లేక పోవడంతో ఆ బాలికకు గ్రామస్తుల వినతి మేరకు ఆశ్రమ పాఠశాలలో గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు ప్రవేశం కల్పించారు.

ఆశ్రమ పాఠశాలకు దగ్గరలో ఇంటి నుంచి పాఠశాలకు రాకపోకలు సాగిస్తూ చదువుతోంది. బాలికకు మలేరియా, టైఫాయిడ్‌ జ్వరం రావటంతో మందులు వాడేందుకు రోజూ ఇంటి నుంచి పాఠశాలకు రాకపోకలు సాగించడానికి ఆగస్టు 18న తల్లి అనుమతిపత్రం అందించటంతో ఒప్పుకున్నట్టు హెచ్‌ఎం సింహాచలం తెలిపారు. పాఠశాలకు చదువు నిమిత్తం వస్తున్న బాలిక శరీర ఆకృతిలో తేడా గమనించి పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు చేయంచడంతో గర్భం దాల్చినట్టు నిర్ధారణ అయ్యిందని పాఠశాల ఏఎన్‌ఎం చెప్పారు. బాలిక తల్లిదండ్రులను పాఠశాలకు రప్పించి విషయాన్ని తెలియజేయడంతో బాలికను నిలదీయగా అదే గ్రామానికి చెందిన గిరిజన యువకుడితో ప్రేమలో పడినట్టు, అది శారీరక సంబంధానికి దారితీసినట్టు తేలిందని హెచ్‌ఎం తెలిపారు.

మహిళా కమిషన్‌ సభ్యురాలి విచారణ
పాఠశాలను మాజీ మంత్రి, మహిళా కమిషన్‌ సభ్యురాలు మత్స్యరాస మణికుమారి సందర్శించారు. హెచ్‌ఎం సింహాచలం, డిప్యూటీ వార్డెన్‌ రాజేశ్వరిని వివరాలు
అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినికి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆమె చెప్పారు. బాలిక గర్భం దాల్చిన ఘటనపై సోమవారం పాడేరు గిరిజన సంక్షేమ డీడీ విజయ్‌కుమార్‌ విచారణ చేపట్టారు.
నుర్మతి ఆశ్రమోన్నత పాఠశాలలో విచారణ చేస్తున్న పాడేరు డీడీ విజయ్‌కుమార్‌ 

మరిన్ని వార్తలు