అడవి నుంచి అంతరిక్షానికి..!

2 Jul, 2020 09:01 IST|Sakshi
కొత్తపల్లిలో తన ఇంటి ముందు కుటుంబ సభ్యులతో భద్రయ్య

ఓ గిరిపుత్రుని ఆరాటం

అనుమతి కోసం ప్రభుత్వానికి విన్నపం

చింతూరు: ఎంతో సాహసోపేతమైన అంతరిక్ష యాత్రకు వెళ్లేందుకు ఓ అడవిబిడ్డ ఆరాట పడుతున్నాడు. అంతరిక్షయానానికి వెళ్లడం ద్వారా దేశ, రాష్ట్ర కీర్తి ప్రతిష్టను ఇనుమడింప చేసేందుకు అతను ఉవ్విళ్లూరుతున్నాడు. దీనికోసం తనకు అనుమతితో పాటు ఆర్థికసాయం చేయాలని ఏడాదిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. మండలం కొత్తపల్లికి చెందిన దూబి భద్రయ్య మన రాష్ట్రం నుంచి ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి వ్యక్తిగా కీర్తి గడించాడు. ఆ స్ఫూర్తితో అతడు అంతరిక్ష యానానికి వెళ్లాలని భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. 

గిరిబిడ్డలకు శిక్షణ 
2016లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భద్రయ్య 2017–18లో 17 మంది గురుకుల విద్యార్థులకు పర్వతారోహణలో శిక్షణనివ్వడం ప్రారంభించాడు. భద్రయ్య శిక్షణలో రాటుదేలిన వారిలో వీఆర్‌ పురం మండలానికి చెందిన కుంజా దుర్గారావు, అడ్డతీగల మండలానికి చెందిన భానుప్రకాష్‌లు ఎవరెస్టును అధిరోహించారు. ప్రస్తుతం భద్రయ్య అరకు స్పోర్ట్స్‌ పాఠశాలలో స్పోర్ట్స్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు అంతరిక్షయానానికి వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి, ఆర్థికసాయం కోసం ప్రయతి్నస్తున్నాడు. గతంలో నాసా ద్వారా అంతరిక్ష యాత్రకు వెళ్లిన మన దేశానికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ స్ఫూర్తితో తానుకూడా అంతరిక్ష యాత్ర చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు భద్రయ్య తెలిపాడు. గిరిబిడ్డల ప్రతిభను ప్రపంచానికి చాటాలని నిర్ణయించుకున్నానని, దీనికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించి అవకాశం కలి్పంచాలని అతను కోరాడు. ఈ మేరకు చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణను కలసి తన లక్ష్యాన్ని వివరించాడు.  

అంతరిక్షయానం నా స్వప్నం 
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సమయంలోనే అంతరిక్ష యాత్ర చేయాలని స్వప్నంగా పెట్టుకున్నా. ఇది ఆర్థికంగా, ప్రయాసతో కూడుకున్నది కావడంతో ప్రభుత్వ సాయం కోసం వేచిచూస్తున్నా. ప్రభుత్వం ఆదుకుంటే గిరిబిడ్డల సత్తా ప్రపంచానికి చాటి చెబుతా. ఎవరెస్టు అధిరోహించిన సమయంలో గత ప్రభుత్వం రూ.10 లక్షలతో పాటు ఇల్లు ఇస్తామని చెప్పిన హామీ నేటికీ నెరవేరలేదు. ప్రస్తుత ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందిస్తే బాగుంటుంది.
– దూబి భద్రయ్య

కుటుంబ నేపథ్యమిది..
కొత్తపల్లికి చెందిన దూబి భీమయ్య, కన్నమ్మల ముగ్గురు సంతానంలో పెద్దవాడు దూబి భద్రయ్య. భార్య బుచ్చమ్మ గురుకుల కళాశాలలో జూనియర్‌ లెక్చరర్‌గా పనిచేస్తోంది. వ్యవసాయ కుటుంబంలో జని్మంచిన భద్రయ్య తొలి నుంచి పర్వతారోహణపై ఎంతో మక్కువ పెంచుకున్నాడు. ఎలాగైనా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకుని 2016లో ఆ కల నెరవేర్చుకున్నాడు.  

మరిన్ని వార్తలు