కనికరించట్లేదు

12 Mar, 2018 13:11 IST|Sakshi

పదేళ్లలో ఏనుగుల దాడిలో 15 మంది మృతి

చర్యలు తీసుకోని ప్రభుత్వం

భయాందోళన చెందుతున్న   గ్రామస్తులు

భారీగాపంటలకునష్టం

సీతంపేట/కొత్తూరు: ఏనుగుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మాత్రం కనికరించట్లేదు. ఐటీడీఏ సబ్‌ప్లాన్‌ పరిధిలో వివిధ మండలాల్లో సంచరించి ప్రాణ, ఆస్తినష్టానికి పాల్పడుతున్న ఏనుగులను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తూరు మండలలోని టింపటగూడకు చెందిన కుమార్‌(20)పై చెరుకు తోటలో ఏనుగులు దాడి చేసి ప్రాణం తీసిన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒడిశా లఖేరీ అడవుల నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల సరిహద్దులో ఏనుగుల గుంపు ప్రవేశించి పదకొండేళ్లలో 15 మందిని పొట్టనపెట్టుకున్నాయి. దీంతో గిరిజన ప్రాంతాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన మొదటి పాలకవర్గ సమావేశంలో.. ఏనుగులను ఒడిశాకు తరలిస్తామని చెప్పినా అది మాటలకే పరిమితమైంది.

జిల్లాలో వరుస సంఘటనలు ఇలా..
2007 డిసెంబర్‌ 14న సీతంపేట మండలం చినబగ్గకు చెందిన పసుపురెడ్డి అప్పారావుతో పాటు దోనుబాయ గ్రామానికి చెందిన సిరిపోతుల మేరమ్మను కోదుల వీరఘట్టం వద్ద ఏనుగులు మట్టుపెట్టాయి. అదే నెల 19న వీరఘట్టానికి చెందిన పాత్రికేయుడు కుంబిడి నాగరాజును హుస్సేన్‌పురం వద్ద హతమార్చాయి. 21న ఇదే మండలం సంతనర్సిపురం వద్ద తెంటు శ్రీనివాసరావును, 2008 జనవరి 1న కొండగొర్రె సాంబయ్యను విచక్షణారహితంగా చెట్లకు విసిరికొట్టి హతమార్చాయి. అనంతరం 2016 సంవత్సరం హిరమండలం మండలం పాడలి గ్రామానికి చెందిన శాశుబిల్లి మురళి(25 పై దాడి చేసి ప్రాణాలు తీశాయి. 2017 సంవత్సరం హిరమండలం ఎగురు రుగడ గ్రామానికి కీసరతవిటయ్యపై ఏనుగుల గుంపు దాడి చేసి చంపేసింది. ఇలా దశాబ్దంలో 15 మందిని  పొట్టనబెట్టుకున్నాయి. ఈ దాడుల్లో మృతి చెందిన వారికి అరకొర పరిహారంతో ప్రభుత్వం సరిపెట్టింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ కొలువు ఇప్పిస్తామని అప్పట్లో నేతలు చెప్పినా అవి అమలుకు నోచుకోలేదు. దీంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

భారీగా పంటలకు నష్టం
వేసవి తాపానికి తట్టుకోలేక తాగునీరు, ఆహారం కోసం ఏనుగులు వరి, చెరకు, అరటి, కంది, మామిడి, జీడి, పనస వంటి పంట పొలాలను, తోటలను ధ్వంసం చేస్తున్నాయి. మరికొన్ని సంఘటనల్లో గిరిజనులు వేసుకున్న పాకలను కూడా పీకిపారేశాయి. పూరిళ్లను పడదోశాయి. 2 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలను నాశనంచేశాయి. సుమారు రూ.36 లక్షల పరిహారం చెల్లించారు. ఇంకా రూ.30 లక్షల వరకు పరిహారం చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఎటువంటి పరిహారం లేకపోవడం గమనార్హం.

ఫలితమివ్వని ఆపరేషన్‌ గజ
2007 అక్టోబర్‌లో ఏనుగుల గుంపును తరలించేందుకు అప్పటి అటవీశాఖ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు తీసుకున్న నిర్ణయం మేరకు ‘ఆపరేషన్‌ గజ’ చేపట్టారు. చిత్తూరు, బెంగుళూరుకు సంబంధించిన తర్ఫీదు పొందిన మావటిలతోపాటు జయంతి, గణేష్‌ అనే శిక్షణ పొందిన ఏనుగులను రంగంలోకి దించారు. ఆశించినంతగా ఫలితం ఇవ్వకపోయినా రెండు ఏనుగులను అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనాలతో ఒడిశా అడవుల్లోకి పంపించే ప్రయత్నం చేశారు. ఇందులో ఒకటి మార్గమధ్యంలోనే మృతిచెందింది. అనంతరం వివిధ కారణాలతో 11 ఏనుగుల్లో ఏడు మృతి చెందగా నాలుగు మిగిలాయి. అటవీశాఖాధికారుల సూచనల మేరకు ప్రత్యేక నిఘా బృందాలు, రూట్‌ ట్రాకర్లను ఏర్పాటుచేయడంతో ప్రమాద హెచ్చరిక బోర్డులు, సోలార్‌ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఎలిఫేంట్‌ జోన్‌గా గుర్తించాలని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. గిరిజనులు దీనిని వ్యతిరేకించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోక తప్పలేదు. ఇదే క్రమంలో కందకాలు తవ్వే ఏర్పాట్లను చేపట్టినా ఫలితం ఇవ్వలేదు.

ఆందోళనలో గ్రామస్తులు
పది రోజుల నుంచి పొన్నుటూరు పంట పొలాల్లో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు ఎప్పు డు దాడి చేస్తుందోనని పొన్నుటూరు, బంకితో పాటు పలు గిరిజన గ్రామాల ప్రజ లు ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయాల్లో గ్రామాల్లోకి చొరబడతాయేమోననే భయం వీరిని వెంటాడుతోంది. ఒడిశా నుంచి వచ్చిన ఏనుగుల గుంపును అధికారులు తరలించకపోవడం, ఈ సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో కుమార్‌ మృతిచెందాడని గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

మరిన్ని వార్తలు