వైద్యులపై చర్యలు తీసుకోవాలి

21 Nov, 2014 01:05 IST|Sakshi
వైద్యులపై చర్యలు తీసుకోవాలి

కురుపాం: వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతి చెందిందంటూ గిరిజన విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు రహదారిపై ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కురుపాం పంచాయతీ పరిధిలోని కస్పా గదబవలస గిరిజన గ్రామానికి చెందిన వంజరాపు అన్నపూర్ణ,  వెంకటిల కుమార్తె  వం జరాపు జయలక్ష్మి (17) పాచిపెంట మండలంలోని పి.కోనవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఇంటర్‌మీడియెట్ చదువుతోంది. ఈ నెల14న ఆమెకు జ్వరం రావడంతో సాలూరు సీహెచ్‌ఎన్‌సీలో కళాశాల సిబ్బంది చేర్చారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం   మృతి చెందింది.
 
 కళాశాల ప్రిన్సిపాల్ ఎం.వి.ధనరాజు సిబ్బంది కలిసి విద్యార్థిని మృతదేహాన్ని స్వగ్రామానికి అంబులెన్స్‌లో మధ్యాహ్నం  తీసుకు వచ్చి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.  దీంతో మృతదేహాన్ని చూసిన తల్లి అన్నపూర్ణ స్పృహ కోల్పోగా బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి  గ్రామ సమీపంలోనే రహదారిపై మృతదేహంతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ  జయలక్ష్మి మృతి చెందడానికి  వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వారిపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చే శారు. విషయం  తెలుసుకున్న కురుపాం, చిన్నమేరంగి, జియ్యమ్మవలస ఎస్సైలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
 
 బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: అధికారుల హామీ
 మృతిచెందిన వంజరాపు జయలక్ష్మి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఏటీడబ్ల్యూఓ మారుతి బాయి,  తహశీల్దార్ ఎం. ప్రకాష్, జెడ్పీటీసీ సభ్యురాలు  పద్మావతి ఐటీడీఏ పీఓ ప్రతినిధులుగా వచ్చి ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు,  గిరిజన సంఘ నాయకులకు హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగమిస్తామని,  ట్రైకార్ లోన్ ఇప్పిస్తామని మృతికి కారకులపై దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన కారులు శాంతించారు. అలాగే జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.వి. ధనరాజు సిబ్బందితో కలిసి వచ్చి మృతురాలి కుటుంబసభ్యులకు రూ.60 వేలు పరిహారం ఇస్తున్నట్లు చెప్పారు.  ఈ ఆందోళన లో గిరిజన సంఘం నాయుకులు కోలక లక్ష్మణమూర్తి, గొర్లి తిరుపతిరావు, కోలక అవినాష్,   విద్యార్థి సంఘం నాయకుడు పల్ల సురేష్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
 
 మృతిపై తహశీల్దార్ ఆరా
 పి.కోనవలస(పాచిపెంట):గిరిజన విద్యార్థిని జయలక్ష్మి మృతికి గల కారణాలను పాచిపెంట ఇన్‌చార్జి తహశీల్దార్ గిరిధర్ వైస్ ప్రిన్సిపాల్ కృష్టవేణిని అడిగి తెలుసుకున్నారు. జ్వరం సమయంలో  ఏ ఆస్పత్రులకు తీసుకు వెళ్లారని ప్రశ్నించారు. దీనికి వైఎస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ నెల 14న జ్వరం వస్తే పాచిపెంట పీహెచ్‌సీకి తీసుకు వెళ్లి పరీక్షలు చేయించామని మళ్ళీ 18న సాలూరు సీహెచ్‌సీకి తరలించామని వైద్యం పొందుతుండగా మృతి చెందినట్లు తెలిపారు. తహశీల్దార్ వెంట పి.కోన వలస వీఆర్‌ఓ శ్రీనివాసరావు విచారణలో పాల్గొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా