ఘోరం...

2 Feb, 2015 03:04 IST|Sakshi
ఘోరం...

 మేలిమి బంగారు తల్లులు..ఎండ పొడ సోకితేనే కందిపోయే పిల్లలు..అభం...శుభం ఎరుగని బావిభారత పౌరులు.. వారికి  ప్రపంచ జ్ఞానం చెప్పి, ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన మాస్టార్లు వారి పాలిట యముళ్లలా తయారవుతున్నారు. పిల్లల మానసిక స్థితిని తెలుసుకోకుండా వారి పాలిట కాఠిన్యం ప్రదర్శిస్తున్నారు. బయటికి చెప్తే టీసీ ఇచ్చి పంపేస్తా మని భయపెడుతూ వారిని జైళ్లలో ఖైదీల మాదిరిగా పరిగణిస్తున్నారు. ఈ స్థితిలో ఎంతో పెద్ద సమస్యలైతేగాని విద్యార్థులు, తల్లిదండ్రులు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. పండగ సెలవులు పూర్తయిన వెంటనే పాఠశాలకు రాకుండా ఆలస్యంగా వచ్చారని..ఆడపిల్లలని కూడా చూడకుండా మోకాళ్లపై వారిని నడిపించి తీవ్రగాయాల పాలయ్యేలా చేశారు. గుమ్మలక్ష్మీపురం మండలం పి.ఆమిటి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల  తెలుగు మాస్టార్ ఎం.రవి అనే ప్రబుద్ధుడు విధించిన ఈ శిక్ష ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..
 
 పార్వతీపురం/గుమ్మలక్ష్మీపురం: సంక్రాంతి సెలవులకు ఇంటికెళ్లిన విద్యార్థినులు గిరిజనులు జరుపుకొనే కొత్తల పండగ పూర్తి చేసుకుని పాఠశాలకు ఆలస్యంగా వచ్చారు. దీనిపై ఆగ్రహించిన ఆ పాఠశాల తెలుగు మాస్టార్ మూటక రవి పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన ఒక్కో విద్యార్థిని రూ.150  ఫైన్ కట్టాలని, లేదంటే గ్రౌండ్‌లో ఆరు రౌండ్లు మోకాళ్లపై నడవాలని ఆదేశించారు. అయితే వారంతా నిరుపేద గిరిజన కుటుంబాలకు చెందిన పిల్లలు కావడంతో రూ.150 కట్టలేక ఆరు రౌండ్లు మోకాళ్లపై నడిచారు.  సుమారు 130 మంది పిల్లలను అలా నడిపించారు. ఇందులో కొంతమంది పిల్లలకు మోకాళ్లపై చర్మం ముక్కలూడి పుళ్లుగా మారాయి. కొంతమంది మోకాళ్లు వాచిపోయి నడవలేని స్థితికి చేరుకున్నారు.  అయితే పువ్వల అశ్విని అనే విద్యార్థినికి నొప్పులు అధికం కావడంతో స్థానిక పీహెచ్‌సీలో చూపించారు. అక్కడ తగ్గకపోవడంతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి ఆదివారం తరలించారు.
 
 ఈనేపథ్యంలో ఆ విద్యార్థిని మోకాళ్ల నొప్పులతోపాటు మలేరియా జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించామని వైద్యాధికారి డా.వెంకటరావు తెలిపారు. సంఘటన విషయం తెలుసుకున్న ఐద్వా నాయకురాలు రెడ్డి శ్రీదేవి, విద్యార్థి సంఘ నాయకులు అశోక్, ముఖేష్, రవి, గిరిజన సంక్షేమ సంఘ నాయకులు పి.రంజిత్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని విద్యార్థినిని పరామర్శించారు. ఈసందర్భంగా డీడీ కేవీవీ రమణ రాయుడు తదితరులు ఏరియా ఆస్పత్రికి చేరుకుని విద్యార్థిని ఆరోగ్యంపై ఆరా తీశారు. అయితే ఎవరైనా వచ్చి అడిగితే మేమే నడిచాం...ఆలస్యంగా పాఠశాలకు వచ్చినందుకు మాకు మేమే పనిష్మెంట్ విధించుకున్నామని చెప్పాలని తెలుగు మాస్టార్‌తోపాటు తోటి మాస్టార్లు పిల్లలను బెదిరించినట్లు సమాచారం.  ఇంతే కాకుండా బాలికల  ఆశ్రమ పాఠశాలలో వయస్సు మళ్లిన ఉపాధ్యాయులకే నియామకాలు ఇవ్వాల్సి ఉండగా యువకులైన ఉపాధ్యాయులు పనిచేస్తుండడం గమనార్హం.
 
 ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఏటీడబ్ల్యూఓ
 ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న పి.ఆమిటి ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థిని పత్తిక అశ్విని విషయంపై సమాచారం తెలుసుకున్న గుమ్మలక్ష్మీపురం ఏటీడబ్లూఓ వరలక్ష్మీ ఆదివారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దర్యాప్తు నిమిత్తం వచ్చానని, నివేదికను తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.
 
 హెచ్‌ఎం ఏమన్నారంటే..
 ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె.చిన్నారావును వివరణ కోరగా ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు మోకాళ్లపై నడవడం వాస్తవమేనన్నారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులెవరూ విద్యార్థులను మోకాళ్లపై నడిపించలేదన్నారు. పాఠశాలకు సెలవుల అనంతరం ముందుగా వచ్చిన విద్యార్థులే, లేటుగా వచ్చిన విద్యార్థులను మోకాళ్లపై నడిపించారని చెప్పారు. అలాగే విద్యార్థులను మోకాళ్లపై నడిపించారన్న ఆరోపణలు  ఎదుర్కొంటున్న తెలుగు ఉపాధ్యాయుడు మూటక రవిని వివరణ అడగగా విద్యార్థులు మోకాళ్లపై నడిచేటప్పుడు ఉన్నాను  కానీ..విద్యార్థులను మోకాళ్లపై నడవమని చెప్పలేదన్నారు. పాఠశాలలో అన్ని విషయాల్లో తాను ముందుండడం వల్ల తానే నడిపించానని విద్యార్థులు తన పేరు చెబుతుంటార న్నారు.
 
 తెలుగు మాస్టార్‌ను సస్పెండ్ చేయండి
 విద్యార్థినులను మోకాళ్లపై నడిపించి అనారోగ్యానికి కారకుడైన తెలుగు మాస్టార్ ఎం.రవిని సస్పెండ్ చేయాలని ప్రజా, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘ నాయకులు పి.రంజిత్ కుమార్, విద్యార్థి సంఘ నాయకులు ఎ.అశోక్, ఐద్వా నాయకురాలు రెడ్డి శ్రీదేవి తదితరులు ఆదివారం ఐటీడీఏ ఇన్‌చార్జి డీడీ కేవీవీ రమణ రాయుడ్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా అస్వస్థతకు గురైన పువ్వల అశ్విని తల్లిదండ్రులు పువ్వల కళావతి, శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఆలస్యంగా వచ్చినందుకు రూ.150 ఫైన్ కట్టమన్నారని పాప చెప్పగా, కట్టేద్దామని చెప్పినా...మోకాళ్లతో నడిచేస్తానంటూ...అనారోగ్యాన్ని తెచ్చుకుందని వాపోయారు. అటువంటి ఉపాధ్యాయుడ్ని పాఠశాల నుంచి  తొలగించాలని వారు కోరారు. ఈ విషయమై డీడీ మాట్లాడుతూ జరిగిన సంఘటన నేపథ్యాన్ని డీఈఓ, ఐటీడీఏ పీఓలకు ఫైల్ పెట్టామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు