ఇది తగునా..?

24 Mar, 2016 23:31 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం : గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు విషయంలో రాష్ర్ట ప్రభుత్వమే జాప్యం చేస్తోందా?..  కేంద్రం ముందుకొచ్చినా మన సర్కార్ సిద్ధం కాలేకపోతుందా? .. వర్శిటీ ఏర్పాటుకు కేంద్రం సంసిద్ధంగా ఉన్నా మన పాలకులు చొరవ చూపడం లేదా?..  నిధుల విడుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ మే తాత్సారం చేస్తుందా?..  తరగతుల ప్రారంభం కో సం మరికొంత కాలం వేచి చూడక తప్పదా?.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానాలు రేకెత్తుతున్నాయి.  గిరిజన యూనివర్శిటీని జిల్లాలోనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చింది.
 
 దీంతో జిల్లాలో వేర్వేరు చోట్ల స్థలాలను చూసి నా చివరికీ కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ గ్రామం లో ఉన్న స్థలంపైనే కేంద్రబృందం ఆసక్తి చూపింది. అక్కడే గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కూడా  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 526.24 ఎకరాలను జిల్లా అధికారులు గుర్తించారు. దీన్ని చదును చేయడంతో పాటు స్థలంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు, స్తంభాలను తొలగించి ప్రహరీ నిర్మించి ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. దీంతో జిల్లా అధికారులు తగిన ప్రణాళికలు కూడా రూపొందిం చారు.
 
 రూ. 12 కోట్లు అవసరం ..
 ఎత్తుపల్లంగా ఉన్న భూములను చదును చేసేందుకు రూ. 4 కోట్లు, ప్రహరీ నిర్మాణానికి రూ. 5 కోట్లు, హైటెన్షన్ విద్యుత్ వైర్లు,  స్తంభాలను మరో ప్రాంతానికి మార్చడానికి రూ. 3 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి పంపించారు. వాస్తవానికైతే హైటెన్షన్ వైర్లను అండర్ గ్రౌండ్‌లో పంపించాలని తొలుత భావించారు. కాకపోతే  దానికయ్యే ఖర్చు రూ. 11కోట్లు వరకు ఉంటుందని చెప్పడంతో ప్రభుత్వ మే వెనక్కి తగ్గింది. అండర్ గ్రౌండ్ అవసరం లేదని, వేరే ప్రాంతానికి తరలించాలని చెప్పడంతో ట్రాన్స్‌కో అధికారులు రూ. 3 కోట్ల ప్రతిపాదన చేశారు.
 
 రూ. ఐదు కోట్లు విడుదల
 పనులకు రూ. 12 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాధనలు పంపించగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఐదు కోట్లు మాత్రమే విడుదల చేసింది. చదును, విద్యుత్ లైన్ల మార్పు విషయాన్ని పక్కనబెట్టి కేవలం ప్రహరీ కోసం మాత్రమే నిధులు మంజూరయ్యూయి. అయితే పనులన్నీ పూర్తయితేనే వర్శిటీ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వస్తుంది. ఇదిలా ఉంటే ప్రహరీ నిర్మాణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వేల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సొసైటీకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.  దీంతో సంబంధిత అధికారులే నేరుగా పనులు చేపట్టాల్సి ఉంది. కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పెద్దలు వర్శిటీ ఏర్పాటుపై పలు ప్రకటనలు చేస్తున్నా అందుకు తగ్గ అడుగులు పడకపోవడంపై అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.  
 

మరిన్ని వార్తలు