ఆగని డోలీ కష్టాలు

6 Jan, 2020 13:19 IST|Sakshi
నెలలు నిండిన గిరిజన గర్భిణిని డోలీలో మోసుకుని వస్తున్న గిరిజనులు

నెలలు నిండిన గర్భిణిని డోలీలో తీసుకొచ్చిన గిరిజనులు

పీహెచ్‌సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో సీహెచ్‌సీకి తరలింపు

వారం రోజుల్లో రెండో డోలీ సంఘటన..

విజయనగరం, శృంగవరపుకోట రూరల్‌ : గిరిజన పల్లెలను రహదారి సమస్య వేధిస్తోంది. అత్యవసర వేళ ఆస్పత్రికి తరలించడానికి డోలీ అనివార్యమవుతోంది. శృంగవరపుకోట మండలంలో నెలలు నిండిన ఓ గర్భిణిని డోలీ సాయంతో ఆదివారం మైదాన ప్రాంతానికి తీసుకువచ్చారు. అప్పటికే సమాచారం అందుకున్న కొట్టాం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ముమ్ములూరి ఫణీంద్ర ఆదేశాల మేరకు హెల్త్‌ అసిస్టెంట్‌ తాతారావు పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఫీడరు అంబులెన్స్‌ సాయంతో శృంగవరపుకోట పట్టణంలోని సామాజిక ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

శృంగవరపుకోట మండలం, దారపర్తి గిరిశిఖర పంచాయతీ పల్లపుదుంగాడ గిరిజన గ్రామానికి చెందిన జన్ని సుమిత్ర అనే గర్భిణికి ఉదయం 6గంటల సమయంలో పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. బాధతో విలవిలలాడుతున్న ఆమెను భర్త సన్యాసిరావు, తోటి గిరిజనులు అప్పటికప్పుడు డోలీ కట్టిసుమారు 9 కిలోమీటర్లు రాళ్లు, గుట్టల రహదారిలో బొడ్డవర పంచాయతీకి చెందిన దబ్బగుంట మైదాన గ్రామం వద్దకు చేర్చారు. అక్కడి నుంచి ఫీడరు అంబులెన్స్‌లో ఎస్‌.కోటలోని సీహెచ్‌సీలో చేర్చగా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రంధి త్రినాథరావు ఆమెకు చికిత్స అందించా రు. మరో 24 గంటల్లో ఆమె ప్రసవించే అవకా శం ఉన్నందున జాగ్రత్తగా చూసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. 

రహదారి లేకనే ఇలాంటి కష్టాలు
గిరిశిఖర గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేకనే గర్భిణులు, రోగులను మైదాన ప్రాంతం వరకు డోలీలో దిగువకు మోసుకుని రావాల్సి వస్తోందని, ఇలాంటి సమయాల్లో ఒక్కోసారి మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోతు న్న సందర్భాలు కూడా ఉన్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎస్‌.కోట మండలంలో పర్యటించిన రాష్ట్ర డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి దృష్టికి రోడ్డు సమస్య తీసుకెళ్లినట్టు చెప్పారు. గడచిన వారం రోజుల్లోనే గిరిజన గ్రామం నుంచి నిండు గర్భిణిని డోలీలో మైదాన ప్రాంతానికి తీసుకు రావడం ఇది రెండోది.

మరిన్ని వార్తలు