గిరిజన సంక్షేమం?

7 Jan, 2016 23:57 IST|Sakshi

సీతంపేట : ఐటీడీఏలో ప్రాజెక్టు అధికారి (పీఓ) తర్వాత అత్యంత కీలకమైన విభాగాధిపతి గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్. ఈ పోస్టు భర్తీ చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుంది. రాష్ట్రంలో అన్ని ఐటీడీఏలకు డీడీ పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ అయినప్పటికీ సీతంపేటలో మాత్రం మూడేళ్లుగా భర్తీ చేయకుండా ప్రభుత్వం వదిలేసింది. కేవలం ఇన్‌చార్జిలతోనే కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడేళ్ల క్రితం ఇక్కడ డీడీగా పని చేసిన సర్వేశ్వరరెడ్డికి ఐటీడీఏ పీఓగా పదోన్నతి లభించడంతో ఆయన  నెల్లూరు జిల్లాకు  బదిలీపై వెళ్లిపోయారు. అనంతరం ఐటీడీఏ ఏపీఓగా పని చేసిన కొమరం నాగోరావు కొంతకాలం వరకు ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన తెలంగాణకు బదిలీ కావడంతో వంశధార ఎస్‌డీసీ సుదర్శనదొరను ఇన్‌చార్జిగా నియమించారు. ఆయనకు విజయవాడ సీఆర్‌డీఏకు బదిలీ కావడంతో ఏడాదిన్నర కిందట డిప్యూటీడీఎంఅండ్‌హెచ్‌ఓగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న నాయిక్‌కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పజెప్పారు.
 
 ఇదీ పరిస్థితి...
 ఐటీడీఏ పరిధిలో  25 గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, 16 ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాలలు, ఏడు వసతిగృహాలు, 13 పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాలు, 4 గురుకుల పాఠశాలలు, 3 కేజీబీవీలు, రెండు మినీగురుకులాలు ఉన్నారుు. ఇందులో 16 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి సంక్షేమాన్ని పర్యవేక్షించా ల్సి ఉంది. అలాగే విద్యార్థుల మౌలిక వసతుల స్థితిగతులు చూడాల్సిన బాధ్యత ఉంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేపథ్యం, మెనూ సక్రమంగా పాటిస్తున్నారా అనే విషయా లు కూడా డీడీయే పర్యవేక్షించాల్సి ఉం ది. సంక్షేమశాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చే యాల్సి ఉంది.
 
  ఎన్టీఆర్ విద్యాజ్యోతి, అంబేడ్కర్ విద్యానిధి, గిరిపుత్రిక కల్యాణం, పోస్ట్‌మెట్రిక్ విద్యార్థు ల ఉపకార వేతనాల ఆన్‌లైన్ చేయడం వంటి కార్యక్రమాలు పక్కాగా పర్యవేక్షించాల్సి ఉంది.  వైద్యశాఖలో కీలక బాద్యతలు నిర్వర్తిస్తున్న డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డీడీగా అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఇటు వైద్యశాఖ, అటు విద్యాశాఖ రెండు బాధ్యతలు పర్యవేక్షణతో ఆయన కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి ఉంది. 271 జీఓ ప్రకారం ఐటీడీఏ పీఓకు అన్ని శాఖలను నియంత్రించే అధికారం ఉంది. గిరిజన సంక్షేమ శాఖకు పూర్తి స్థాయి డీడీ లేకపోవడంతో  గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహించే  పాఠశాలలను ఐటీడీఏ పీఓ ఆకస్మికంగా తనిఖీ చేయడం, చర్యలకు ఉపక్రమించడం, హెచ్‌ఎం, వార్డెన్లు, హానరోరియం డెరైక్టర్లతో తరుచూ సమావేశాలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు.
 
 ఇంతవరకు బాగానే ఉన్నా పీఓ కూడా 15 శాఖల వరకు పర్యవేక్షించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ శాఖపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారే తప్ప మిగతా శాఖలపై ఎటువంటి చర్యలు లేవనే విమర్శలున్నాయి. ఇటీవల కొత్త డీడీగా రంపచోడవరంలో గతంలో పనిచేసిన గ్రూప్ వన్ అధికారి మల్లికార్జునరావును నియమించారు. అయితే ఆయన కూడా ఇక్కడ జాయిన్ కాలేదు. ఈయన రాకను కూడా కొంతమంది కీలక నేతలు, అధికారులు అడ్డుకున్నట్టు తెలిసింది. ఇప్పటికైనా గిరిజన సంక్షేమ శాఖ డీడీ పోస్టు భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు