ఉపాధ్యాయుడి పైశాచికత్వం

16 Jul, 2019 10:40 IST|Sakshi
విద్యార్థినిని చితకబాదుతున్న హెచ్‌ఎం కోటేశ్వరరావు

సంగవాక గిరిజన స్కూల్లో విద్యార్థులను చితకబాదిన టీచర్‌

సోషల్‌ మీడియాలో వీడియోలు హల్‌చల్‌ 

సాక్షి, తుని‍(తూర్పు గోదావరి) : విద్యార్థులను తండ్రిలా చూసుకుంటూ బాధ్యతగా వ్యవహరించాల్సిన హెచ్‌ఎం పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కోటనందూరు మండలంలో ఏకైక గిరిజన గ్రామం సంగవాక. అక్కడి గిరిజన సంక్షేమ పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న కోటేశ్వరరావు  పాఠశాల సమయంలో సాధారణ డ్రెస్‌ (లుంగీ)తో ఉండి తన పడకగదిలో విద్యార్థులను చితకబాదుతున్న వీడియోలు   సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. వాటిని చూసిన గ్రామస్తులు సోమవారం విలేకర్లకు ఆ వివరాలను తెలియజేశారు. గతంలో ఈ పాఠశాలలో హాస్టల్‌ ఉండేదని వారు తెలిపారు. హెచ్‌ఎంగా కోటేశ్వరరావు, వార్డెన్‌గా ఎ. నూకరాజు వచ్చిన తరువాత వారి పనితీరుతో  హాస్టల్‌ను ఎత్తి వేశారన్నారు.

వీరిద్దరూ విధి నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పాఠశాలలో పిల్లలు పూర్తిగా తగ్గిపోయారన్నారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన 35 మంది పిల్లలు మాత్రమే ఈ పాఠశాలలో ఉన్నారని తెలిపారు. హెచ్‌ఎం కోటేశ్వరరావు పిల్లలను హింసిస్తూ, కొడుతున్నారని గ్రామపెద్ద పిట్టం బాబూరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎంఈఓ,  ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారులకు  ఆదివారం ఫిర్యాదు చేశారు. పాఠశాల సమయంలో కూడా హెచ్‌ఎం, వార్డెన్‌ టీవీ రూంకు పరిమితమై ఉంటున్నారని, వీరిని మార్చాలని ఫిర్యాదులో  కోరారు. ఈ దుస్థితిపై ఉన్నతాధికారులందరికీ సమాచారం చేరవేసినట్టు గ్రామస్తులు తెలిపారు. 

మరిన్ని వార్తలు