నా తల్లివి కదూ వైద్యం చేయించుకో..

3 Feb, 2020 13:28 IST|Sakshi
ఆస్పత్రిలో బాలింత రాజేశ్వరిని బతిమాలుతున్న ఎమ్మెల్యే కళావతి

అవగాహన లేమితో వైద్య సేవలకు గిరిజన బాలింతనిరాకరణ

అధికార యంత్రాంగం బతిమాలినా ససేమిరా

ఎమ్మెల్యే కళావతి నచ్చచెప్పడంతో ఎట్టకేలకు అంగీకారం

అధికారుల బాధ్యతాయుత స్పందనకు సర్వత్రా ప్రశంసలు  

శ్రీకాకుళం, పాలకొండ రూరల్‌:  అవగాహన లేమి, మూఢ విశ్వాసాలతో వైద్యం చేయించుకునేందుకు నిరాకరిస్తున్న గిరిజన యువతిని ఒప్పించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అష్టకష్టాలు పడింది. చివరకు ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సైతం బతిమాలాల్సి వచ్చింది. ఆమె బుజ్జగించి, ధైర్యం చెప్పడంతో ఎట్టకేలకు ఆ బాలింత అయిష్టంగానే అంగీకరించింది. దీంతో వైద్యులు ఆక్సిజన్‌ పెట్టి సెలైన్‌ ఎక్కిస్తున్నారు. వివరాలు.. సీతంపేట మండలం కుశిమి పంచాయతీ సీదిమానుగూడకు చెందిన సవర రాజే శ్వరి విశాఖ కేజీహెచ్‌లో జనవరి 27న పండంటి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అక్కడ తనకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదని అక్కడి వైద్యులకు చెప్పా పెట్టకుండా బిడ్డను తీసుకుని భర్త దుర్గారావుతో కలసి స్వగ్రామం వచ్చేసింది. గత రెండు రోజుల నుంచి రక్తహీనతతో రాజేశ్వరి శరీరం పొంగిపోయి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో స్థానిక ఆశా కార్యకర్తల ద్వారా ఈ విషయాన్ని కుశిమి పీహెచ్‌సీ వైద్యులు తెలుసుకున్నారు. తక్షణమే స్పందించిన వీరు బాలింతను శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి వైద్యానికి సహకరించకపోవటంతోపాటు తనకు చిన్నప్పటి నుంచి నాటు వైద్యం తప్ప ఇంగ్లీషు మందులు పడవని, వాటిని వాడనని, తనను తక్షణమే ఇంటికి పంపించేయాలని వాదులాటకు దిగింది. ఆమెకు తోడు రాజేశ్వరి సోదరుడు, వదిన కూడా వంత పాడటంతో భర్త చేసేదిలేక మిన్నకుండిపోయాడు.

రాజేశ్వరి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే, ఆర్డీవో, ఇతర అధికారులు
వైద్యాధికారి రాజ్‌గోపాల్‌ అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వైద్యులు ఈ సమాచారాన్ని ఐటీడీఏ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న ఐటీడీఏ పీఓ సాయికాంత్‌ వర్మ స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో పాలకొండ ఆర్డీవో టీ.వీఎస్‌జీ.కుమార్, ఎస్సై ఆర్‌.జనార్దనరావు, కమిషనర్‌ లిల్లీ పుష్పనాథం, ఆర్‌ఐ రమేష్‌బాబు, వీఆర్వోలు బంకి రాజా, బలివాడ సాయి తదితరులు ఆస్పత్రికి చేరుకొని గిరిజన కుటుంబీకులను ఒప్పించే యత్నం చేశారు. అన్నివిధాలా చెప్పి ఆర్ధికంగా, అధికారికంగా సహకరిస్తామన్నారు. అయినా వారు తమను ఇంటికి పంపేయాలని, పసరు వైద్యం చేయించకుంటామని తేల్చిచెప్పటంతో శతవిధాల ఓప్పించే యత్నం చేశారు. ఈ కాలంలో కూడా నాటు, పసరు వైద్యంపై ఇంత నమ్మకమేమిటని, వైద్యులకు సహకరించాలని నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది.  

ఎమ్మెల్యే రాకతో..  
విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి రాత్రి 8 గంటల సమయంలో ఆస్పత్రికి చేరుకొని రాజేశ్వరిని, ఆమె కుటుంబ సభ్యులను వైద్యం చేయించుకోవాలని బతిమలాడారు. తన బిడ్డ వంటి దానివని, తన మాట విని మందులు వేసుకోవాలని నచ్చజెప్పారు.ఒకానొక దశలో ఆ మందులు తానుకూడా వేసుకుంటానని చెప్పటంతో రాజేశ్వరి మాట విని కొంత మేర వైద్యానికి సహకరించడంతో తక్షణమే వైద్యులు ఆక్సిజన్‌ అందించి సెలైన్‌ పెట్టారు. ఓ గిరిజన బాలింత ఆరోగ్యం కాపాడేందుకు అధికారులు స్పందించిన తీరును అంతా ప్రశంసించారు. ఎమ్మెల్యే రాత్రి 9 గంటల వరకు ఉండి బాలింత వైద్యానికి సహకరించాక అక్కడి నుంచి నిష్క్రమించారు. 

>
మరిన్ని వార్తలు