వన మూలికల వైద్యం

1 Nov, 2018 08:42 IST|Sakshi
వనమూలికలను సేకరించి ఇంట్లో మందులను తయారు చేస్తున్న వనమూలిక వైద్యుడు బిడ్డిక తెలుంగు

ఏజెన్సీలో ఆదరిస్తున్న గిరిజనులు

ప్రమాదకరమంటున్న ప్రభుత్వ వైద్యులు

కురుపాం: శాస్త్రీయంగా రుజువు చేయకుండా.. వన మూలికల వైద్యం మంచిది కాదని ప్రభుత్వ వైద్యులు హెచ్చరిస్తున్నా.. మండల గిరిజనులు అత్యధిక శాతం వనమూలికల వైద్యంపై ఆధారపడుతున్నారు. వీరికి వనమూలికా వైద్యుల సేవా సంఘం (263/2016) భరోసా ఇస్తుండటం విశేషం. కురుపాం మండలంలో వనమూలికా వైద్యుల సేవా సంఘం 2016లో ఏర్పడింది. ఈ సంఘం స్ఫూర్తితో గిరిజన యువత జిజారుగూడ, వెంపటాపురం, పొక్కిరి, జరడ తదితర గ్రామాల్లో వనమూలికా వైద్యం చేస్తున్నారు. పక్షవాతం, ఆయాసం, ఉబ్బసం, పచ్చకామెర్లు, ఎర్ర కామెర్లు, స్త్రీల వ్యాధులు, గ్యాస్ట్రిక్‌ సమస్యలు, పొత్తి కడుపునొప్పి, కాళ్లు, చేతులు తిమ్మెర్లు, క్షయ, క్యాన్సర్, చిన్నపిల్లల సమస్యలను వనమూలికా వైద్యంతో నయం చేస్తున్నారు.

చీకటి కొండల్లో వనమూలికల సేకరణ
కురుపాం మండలంలో ఒడిశా–శ్రీకాకుళం జిల్లాలకు సరిహద్ధు ప్రాంతమైన జరడ సమీపంలో చీకటికొండల్లోకి వనమూలికా వైద్యులు వెళ్లి రెండు రోజుల పాటు అక్కడే ఉండి కావలసిన వన మూలికలను సేకరిస్తున్నారు. ఈ మొక్కలను తమ ఇంటి సమీపంలో నాటి వనమూలికలతో మందులను తయారు చేసి తక్కువ ఖర్చుతో పంపిణి చేస్తున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి
వనమూలికా వైద్యులను ప్రభుత్వం ఆదుకోవాలి. సరైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో వనమూలికలతో తయారు చేసిన మందుల్ని అందిస్తున్నారు. ప్రభుత్వం ఆధునాతన పరికరాలు మంజూరు చేస్తే వనమూలికల మందుల్ని తయారు చేస్తాం.     – బిడ్డిక తెలుంగు,జుజారుగూడ, తిత్తిరి పంచాయతీ, కురుపాం మండలం

వన మూలికలతో ప్రమాదం
ఎలాంటి పరిశోధన జరపకుండా వినియోగిస్తున్న వన మూలికల మందులతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వనమూలికా వైద్యం ద్వారా వ్యాధులు నయం కావచ్చు. కానీ వాటిపై పరిశోధన జరగాలి. వాటితో ఎలా వ్యాధులు నయం అవుతున్నాయో తెలియాలి. అనంతరం వ్యాధిగ్రస్తులు వనమూలికా వైద్యం చేయించుకోవచ్చు. లేకుంటే అధిక మోతాదు వినియోగం వల్ల దుష్పప్రభావం కలగవచ్చు.   – డాక్టర్‌ వారణాసి గౌరీశంకరరావు,సూపరింటెండెంట్, సామాజిక ఆరోగ్య కేంద్రం, కురుపాం

మరిన్ని వార్తలు