‘ఏజెన్సీ’ రహదారుల్లో నిధుల మేత

10 Dec, 2018 03:47 IST|Sakshi
విశాఖ జిల్లా అనంతగిరి మండలం తేనెపుట్టు గ్రామం నుంచి రోడ్డు లేక అడవిలో నడిచి వెళ్తున్న గిరిజనులు

అటవీ ప్రాంతాల్లో రోడ్లు లేక గిరిజనుల అవస్థలు

నాలుగున్నరేళ్లుగా ఒక్క రోడ్డు నిర్మాణాన్నీ పూర్తి చేయని ప్రభుత్వం 

ఒకే రహదారి పనిని ముక్కలుగా చేసి టీడీపీ నేతలకు నామినేషన్‌పై అప్పగింత 

ప్రభుత్వం విడుదల చేసిన రూ.734.96 కోట్లలో 50 శాతానికి పైగా నిధులు పక్కదారి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు లేక గిరిజనులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా గిరిజన గ్రామాలకు పూర్తిస్థాయిలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. పూర్తి చేశామని చెబుతున్న రోడ్లపై మట్టిపోసి వదిలేశారు. కల్వర్టులు ధ్వంసమైనా పునర్నిర్మించిన దాఖలాలు లేవు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజవర్గంలో గిరిజన ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే కళావతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికార టీడీపీ నాయకులు ఈ రోడ్ల కనెక్టివిటీ పేరుతో ప్రభుత్వ నిధులను దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. 

ముక్కలు చేసి.. పనులు పంచి
ఏజెన్సీలో గిరిజన గ్రామాలను కలుపుతూ లింక్‌ రోడ్ల(గ్రావెల్‌ రోడ్లు) నిర్మాణానికి ప్రభుత్వం రూ.734.96 కోట్లు కేటాయించింది. నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లకు పనులను అప్పగించాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికింది. నామినేషన్‌ విధానంతో ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికే రోడ్ల నిర్మాణ పనులను కట్టబెట్టారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) స్థాయిలోనే పనులను ఆమోదించే విధంగా రోడ్ల పనులను ముక్కలు ముక్కలు చేశారు. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం బల్లుగూడ నుంచి పెదబెడ్డ మీదుగా గుమ్మ గిరిజన గూడెం వరకు 28.1 కిలోమీటర్ల రహదారి పనులను నాలుగు ముక్కలు చేసి, తెలుగుదేశం పార్టీ నాయకులకు నామినేషన్‌ విధానంలో అప్పగించారు. 7.9, 7.9, 2.4, 9.9 కిలోమీటర్లు.. ఇలా నాలుగు భాగాలుగా విభజించారు. 10 కిలోమీటర్ల లోపు రహదారుల పనులను మంజూరు చేసే అధికారం ఈఈకి ఉంటుంది. ఈ వెసులుబాటును అధికార పార్టీ నేతలు ఉపయోగించుకున్నారు. ఏజెన్సీలో రహదారుల నిర్మాణం కోసం విడుదల చేసిన రూ.734.96 కోట్ల నిధుల్లో 50 శాతానికి పైగా నిధులను కాంట్రాక్టర్ల ముసుగులోని టీడీపీ నేతలు, అధికారులు పంచుకుని తిన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

పనులన్నీ నాసిరకం 
రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాలో మొత్తం 1,224 లింక్‌ రోడ్ల పనులను చేపట్టి, 2,396.69 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించనున్నట్లు టీడీపీ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ప్రకటించింది. ఇప్పటివరకు 584 పనులను పూర్తిచేశామని, 1012.19 కిలోమీటర్ల పొడవున రహదారుల నిర్మాణం పూర్తయినట్లు చెబుతోంది. ఇందులో సగం రోడ్లు పనికి రాకుండా పోయాయని గిరిజనులు తెలిపారు. వర్షాకాలంలో పనులు చేపట్టారని, కొండ ప్రాంతాలు కావడం వల్ల చాలావరకు రోడ్లు కొట్టుకుపోయాయని వెల్లడించారు. ఇంకా 640 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటివరకు పూర్తయిన రోడ్లకు రూ.149.05 కోట్లు ఖర్చుచేశారు. ఈ నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. నాసిరకం రోడ్లు గిరిజనులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. కొన్ని రహదారులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇప్పటికీ మొదలుపెట్టని రోడ్ల పనులు 151 ఉన్నాయి. 328.35 కిలోమీటర్ల మేర ఈ రోడ్లు వేయాల్సి ఉంది. ఇందుకోసం రూ.95.55 కోట్లు ఖర్చు చేయనున్నారు. 

రూ.25 కోట్లు ‘బ్లాస్టింగ్‌’ 
అధికార పార్టీ నాయకులు ఏజెన్సీలో బ్లాస్టింగ్‌ల పేరుతో ప్రజాధనం దోపిడీ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 50 చోట్ల రోడ్ల మధ్యన పెద్ద రాళ్లు ఉన్నాయని, వాటిని తొలగించాలంటే బ్లాస్టింగ్‌ చేయాల్సి ఉందని అధికారులపై ఒత్తిడి తెచ్చి, ప్రతిపాదనలు తయారు చేయించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బ్లాస్లింగ్‌ల కోసం రూ.25 కోట్లు కేటాయించింది. రోడ్ల మధ్య ఎక్కడా పెద్దపెద్ద రాళ్లు లేవని గిరిజనులు పేర్కొంటున్నారు. బ్లాస్టింగ్‌లు చేయాల్సిన అవసరం లేదని, ప్రొక్లెయినర్లతో వాటిని తొలగించవచ్చని అంటున్నారు. అంటే రాళ్ల తొలగింపు పేరిట రూ.25 కోట్లు మింగేయడానికి అక్రమార్కులు స్కెచ్‌ వేసినట్లు స్పష్టమవుతోంది. 

మరిన్ని వార్తలు