మృతదేహంతో కాలినడకన 5 కి.మీ.

4 May, 2019 17:32 IST|Sakshi
సర్వేశ్వరరావు మృతదేహాన్ని మోసుకెళ్తున్న బంధువులు

విశాఖ ఏజెన్సీలో ఘటన

కొయ్యూరు (పాడేరు): రోడ్డు లేకపోవడంతో గిరిజనుడి మృతదేహాన్ని ఐదు కిలోమీటర్ల వరకు మోసుకెళ్లిన ఘటన విశాఖ ఏజెన్సీలో శుక్రవారం జరిగింది. కొయ్యూరు మండలం గరిమండకు చెందిన మర్రి సర్వేశ్వరరావు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించాడు. అతడి బంధువులు మృతదేహాన్ని శుక్రవారం నేరెళ్లబంద వరకు ‘ప్రజాప్రస్థానం’లో తీసుకువచ్చారు. అక్కడి నుంచి రోడ్డు సరిగ్గా లేకపోవడంతో చేసేదేమీలేక డ్రైవర్‌ వాహనాన్ని నిలిపివేశాడు.

మృతుడి బంధువులు మృతదేహాన్ని నేరెళ్లబంద నుంచి గరిమండ వరకు ఐదు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ మోసుకెళ్లారు. అదే తమ గ్రామానికి రహదారి సరిగ్గా ఉండి ఉంటే ‘ప్రజాప్రస్థానం’ వాహనం తమ గ్రామానికి నేరుగా వచ్చి ఉండేదని మృతుడి బంధువులు చెప్పారు. అధికారులు స్పందించి వెంటనే తమ గ్రామానికి రోడ్డు వెయ్యాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ గ్రామానికి దూరంలో ఇంకా అనేక గ్రామాలున్నాయని ,అక్కడా ఇలాంటి పరిస్థతి వస్తే 15 కిలోమీటర్లకు పైగా మృతదేహాలను మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు