-

స్మృతి పథంలో.. ప్రజాసంకల్పం

8 Jan, 2019 08:33 IST|Sakshi

జిల్లాలోని వీరఘట్టం మండలం కడ కెల్ల వద్ద నవంబర్‌ 25న ప్రవేశించిన రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర.. అడుగడునా ప్రజలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతుంది. ఈ సందర్భంగా తమ సమస్యలను చెప్పుకోవడం, జగన్‌ ఆత్మీయ పలకరింపునకు నోచుకోవడం, కలిసి నడవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయనతో కలిసి నడిచిన వారంతా గుర్తు చేసుకున్నారు. పాదయాత్రలో భాగంగా.. వీరఘట్టం మండలంలో ఆదివాసీలతో కలిసి పాదం కలిపి.. గిరిజన సంప్రదాయ నృత్యం చేసిన ప్రతిపక్ష నేత అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే ఆమదాలవలస నియోజకవర్గంలో నైరా కళాశాల వద్ద విద్యార్థులు చేపట్టిన దీక్షా శిబిరానికి చేరుకున్న ఆయన.. ఓ అన్నలా తమ అవస్థలను కింది కూర్చుని ఓపిగ్గా విని భరోసా ఇచ్చారు. నరసన్నపేట నియోజకవర్గంలో జగన్‌ను కలిసిన నూతన దంపతులు ఆయన ఆశీర్వాదంతో పాటు సెల్ఫీ కూడా తీసుకొని అనుబంధాన్ని భద్ర పరుచుకున్నారు. ఇక టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి మండలంలో జగన్‌ను చూసేందుకు 2 కిలోమీటర్లు పరుగులెత్తి వచ్చిన చిన్నారి.. ఆయనను చూసిన ఆనందంలో కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ప్రతిపక్ష నేత ఆ చిన్నారిని ఓ తండ్రిలా గుండెలకు హత్తుకుని, ఓదార్చిన తీరు అందరినీ.. కంటతడి పెట్టించింది. ఇటువంటి ఎన్నో మధుర స్మృతులకు వేదికైన ప్రజా సంకల్పయాత్రలో మజిలీల్లో కొన్ని..

శ్రీకాకుళం ,సీతంపేట: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాలకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించిన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గిరిజనులు సవర నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. వీరఘట్టం మండలం మరియగిరి వద్దకు పాదయాత్ర చేరుకునే సరికి అక్కన్నగూడ, ఈతమానుగూడ గిరిజనులు సవర సాంప్రదాయ నృత్యాలు చేశారు. అలాగే డప్పుల వాయిద్యాలతో అలరించారు. వీరి నృత్యాలు చూసిన జగన్‌.. వారితో కలిసి అడుగు కలిపారు.

నూతన ఉత్తేజాన్ని నింపింది
వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి ప్రజా సంకల్పయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉంది. జిల్లాలో పాదయాత్ర ప్రారంభమైన అనంతరం రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం కనిపిస్తుంది. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు వచ్చిన జగన్‌కు నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం లభించింది. రాజాంలో నిర్వహించిన బహిరంగ సభకు వేలాదిగా జనం తరలి వచ్చారు.  ఊహకందని ఈ ప్రజాభిమానం చూస్తుంటే రాజాంలో వైఎస్సార్‌ అభిమానులు పుష్కలంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో ఇక్కడ పార్టీ గెలుపు నల్లేరుపై నడకని తెలుస్తుంది. నియోజకవర్గంలో మొత్తం 37.5 కిలోమీటర్లు ప్రజాసంకల్ప యాత్ర సాగింది. ఇదే సభలో పిల్లల ఉన్నత చదువులకు మొత్తం ఖర్చు భరిస్తామని హామీ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది. ఓపిగ్గా ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించడం గొప్ప విషయం. ఇంత ఓపికా, సహనం చాలా తక్కువ మందికే ఉంటుంది. కచ్చితంగా జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ప్రజల సమస్యలను తీరుస్తారు.– కంబాల జోగులు, శాసనసభ్యుడు, రాజాం

మరిన్ని వార్తలు