ఆంత్రాక్స్‌ ముప్పు పట్టించుకోని గిరిజనం  

12 Aug, 2019 09:17 IST|Sakshi

విచ్చలవిడిగా పశుమాంసం వినియోగం

వ్యాధులతో ఉన్న పశువుల వధ, అమ్మకాల జోరు

పశువైద్యుల పరీక్షలు  నామమాత్రమే

హుకుంపేట (అరకులోయ): మన్యంలో ప్రతి ఏడాది  ఆంత్రాక్స్‌ వ్యాధి తీవ్రత నెలకొంటున్నప్పటికీ గిరిజనులు మాత్రం ఆ వ్యాధి గురించి ఏ మాత్రం భయపడడం లేదు. కొన్ని వర్గాల గిరిజనులు మాత్రం పశుమాంసం వినియోగాన్ని మానడం లేదు. అయితే పశు వైద్యుల పరీక్షలు అనంతరం పశువులను వధించి, తరువాత మాంసంపై పశుసంవర్థ్ధకశాఖ సీల్‌ వేయాలనే నిబంధనలను పశువైద్యులు, సంబంధిచ వ్యాపారులు పట్టించుకోవడం లేదు. పశువైద్యుల సూచనలు మేరకు తాజా పశు మాంసాన్ని బాగా ఉడకబెట్టి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. కానీ ఏజెన్సీలో మాత్రం వ్యాపారులు గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పలు వ్యాధులతో బక్కచిక్కిన పశువులు, చనిపోవడానికి కొన ఊపిరితో ఉన్న పశువులు, ఒక్కో సమయంలో గుట్టుచప్పుడు కాకుండా మృతి చెందిన పశువులను వధించి, సంతల్లో విచ్చలవిడిగా పశుమాంసం అమ్మకాలు జరుపుతున్నారు.

అయితే పశు మాంసం అమ్మకాలు వ్యాపారులకు సిరులు కురిపిస్తుండగా వినియోగిస్తున్న గిరిజనులు మాత్రం పలు రోగాల బారిన పడుతున్నారు. వ్యాధులతో చనిపోయిన పశువులను ఖననం చేయకుండా, వాటిని కోసిన వారికి, అలాగే ఈ మాంసం వండుకు తిన్నవారికి ఆంత్రాక్స్‌ వ్యాధి సోకే ప్రమాదం ఉందని చర్మవ్యా«ధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రతి శనివారం హుకుంపేట సంతలో ఆవులను వ«ధించిన వ్యాపారులు, ఎలాంటి పశువైద్యులు పరీక్షలు లేకుండానే యథేచ్ఛగా∙ఈ మాంసాన్ని భారీగా  విక్రయిస్తున్నారు. అయితే బక్కచిక్కి,బాగా నీరసించిన పశువులనే కోస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అమాయక గిరిజనులు ఈ పశు మాంసాన్నే కొనుగోలు చేసి తమ ఇళ్లకు తీసుకు వెళుతున్నారు.

సంతలోనే వంటలు..
పశుమాంసాన్ని కొంతమంది సంతలోనే వండి ఫాస్ట్‌ఫుడ్‌ మాదిరిగా వ్యాపారం చేస్తున్నారు. సంతల్లో కల్లు, ఇతర మద్యం సేవిస్తున్న గిరిజనులు ఈ పశుమాంసం  తింటున్నారు. పశుమాంసంను బాగా ఉడకబెట్టి నాణ్యంగా తయారు చేసిన తరువాత తింటే అనారోగ్య సమస్యలు ఉండవని వైద్యులు చెబుతుండగా, ఈ సంతలో మాత్రం నామమాత్రంగా అక్కడికక్కడే ఉప్పు కారం వేసి, ఉడకబెట్టి విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారు. ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ పశుమాంసంను తింటున్నారు.

తనిఖీలు జరుపుతాం.. 
సంతలో పశువుల వధ. మాంసం నాణ్యతను నిర్థారించేందుకు తనిఖీలు చేపడుతున్నాం. అనారోగ్యంతో బాధపడే పశువులు, మృతి చెందిన పశువుల మాంసం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. 

సునీల్,  పశువైద్యాధికారి

మరిన్ని వార్తలు