అన్నమయ్యకు ఘన నివాళి

25 Mar, 2017 17:55 IST|Sakshi

విశాఖ–కల్చరల్‌ : విశాఖ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడెమి ఆధ్వర్యంలో అన్నమయ్య 514వ వర్థంతిని పురస్కరించుకుని కళాభారతి ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన గాత్ర కచేరి ఆకట్టుకుంది. నాద సుధా తరంగణి సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన గాత్ర కచేరిలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, సినీ గాయని శ్రీనిధి (హైదరాబాద్‌) నేదునూరి కృష్ణమూర్తి, శ్రీరంగం గోపాలరత్న తదితర సంగీత ప్రముఖలు స్వరపరిచిన అన్నమయ్య సంకీర్తనలు శ్రావ్యమైన మోహన వంటి రాగాలతో ఆలపించి కచేరిని రక్తకట్టించి అన్నమయ్యకు ఘన నివాళులర్పించారు.

కచేరికి వయోలిన్‌ రమకిరణ్మయి, మృదంగం ధర్మారావు వాయిద్య సహకారం అందించి శభాష్‌ అనిపించుకున్నారు. తొలుత అన్నమయ్య చిత్రపటానికి ప్రముఖ సినీ రచయిత గొల్లపూడి మారుతీరావు, నేదునూరి కృష్ణమూర్తి కుమార్తె శ్రీవల్లి, డాక్టర్‌ జి.ఇందిర, విశాఖ సంస్థ కార్యదర్శి జిఆర్‌కె ప్రసాద్‌ పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త దూసి ధర్మారావు వ్యాఖ్యతగా వ్యవహరించారు.
సాగరతీరంలో సప్తగిరి సంకీర్తనలు
బీచ్‌రోడ్‌ (విశాఖ తూర్పు) : టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, విశాఖ జిల్లా ధర్మ ప్రచార మండలి సంయుక్తంగా శుక్రవారం బీచ్‌రోడ్డులోని అన్నమయ్య విగ్రహం వద్ద సప్తగిరి సంకీర్తనలు అలపించారు. అన్నమయ్య 514వ వర్థంతి సందర్భంగా నగరంలోని సంగీత కళాకారులు ఈ కార్యక్రమంలో కీర్తనలు అలపించారు. దీంతో సాగరతీరం మొత్తం అన్నమయ్య కీర్తనలతో మార్మోగింది. కార్యక్రమంలో విజయ్‌ నిర్మాణ్‌ కంపెనీ అధినేత డాక్టర్‌. సూరపనేని విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు